విధాత : ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిత్ర మండలి’ సినిమా రేపు గురువారం నుంచే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పడీ సినిమా నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య తదితరులు తమ నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు.
కులం పిచ్చితో వ్యవహరించే నారాయణ(వీటీవీ గణేష్) తన కుల బలంతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు.ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో వెతకడం మొదలుపెడతారు. స్వేచ్ఛ పారిపోవడం వెనక అదే ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్) ఉన్నట్టు తేలుతుంది. ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరికోసం ఇంటి నుంచి బయటికొచ్చింది? స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురూ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? వీళ్లని నారాయణ ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.
