Nagarjuna| సినీ తారలంటే జనాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారు పబ్లిక్‌లోకి వస్తే ఓ ఫొటో దిగాలని లేదంటే ఆటోగ్రాఫ్ తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే కొద్దిసార్లు అభిమానుల అత్యుత్సాహం వలన సెలబ్రిటీల పక్కన ఉండే బాడీగార్డులు అభిమానులని పక్కకి నెట్టేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఓ అభిమాని క్యాజువల్‌గానే వచ్చి నాగార్జునతో ఫొటో దిగాలని భావించాడు. కాని నాగ్ బాడీగార్డ్ సదరు అభిమానిని పక్కకు విసిరేయడంతో విషయం తెలుసుకున్న నాగ్.. అతనికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరాడు. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కింగ్‌తో పాటు ధనుష్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఎయిర్ పోర్ట్‌లో ఈ ఇద్దరు నడుచుకుంటూ వెళుతుండగా, ఓ అభిమాని నాగ్ దగ్గరకు సెల్ఫీ కోసం ఉరుక్కుంటూ వచ్చాడు. అయితే ఆ యువకుడిని దురుసుగా వెనుకకు విసిరికొట్టాడు నాగార్జున బాడీగార్డ్. దాంతో ఆ అబ్బాయి కిందపడిపోయినంత పనైంది. అయితే ఈ విషయం నాగార్జున దృష్టికి రావడంతో క్షమాపణలు చెప్పాడు. అయితే ఇప్పుడు అక్కినేని నాగార్జున కుబేర మూవీ షూటింగ్ కోసం మరోసారి ముంబై వెళ్లాడు. అక్కడ ఎయిర్‌పోర్టులో ఈసారి అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈసారి దివ్యాంగుడైన ఆ అభిమాని కూడా నాగ్ దగ్గరకు రాగా, ఆ అభిమానితో కలిసి ఫొటో దిగాడు. ఆ వ్యక్తి నాగార్జున దగ్గరకు రాగానే.. మొన్న మీతో ఫొటో దిగాలనుకున్నది ఇతడే అని ఫొటోగ్రాఫర్లు చెప్పడంతో నువ్వేనా అంటూ అతనితో ఫొటో దిగాడు.
ఇక ఆ దివ్యాంగ అభిమానితో కాసేపు ముచ్చటించాడు. అతడు నాగార్జునకి సారీ చెప్పగా, అందులో నీ తప్పేమి లేదంటూ అతనితో నాగార్జున అన్నాడు. మొన్న బాడీగార్డ్ దురుసు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున.. ఇప్పుడు అదే అభిమానితో ఫొటో దిగడంతో ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం తన వీరాభిమానితో నాగార్జున దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.