Alka Yagnik | అల్కా యాగ్నిక్‌కి అరుదైన జబ్బు

విమానం నుంచి కిందికి దిగుతున్నారు.. అకస్మాత్తుగా ఏమీ వినిపించడం లేదు. ఆ తర్వాత కూడా ఇలా జరిగిందనుకోండి.. అమ్మో.. అనిపిస్తుంది.

  • Publish Date - June 19, 2024 / 08:37 AM IST

విమానం నుంచి కిందికి దిగుతున్నారు.. అకస్మాత్తుగా ఏమీ వినిపించడం లేదు. ఆ తర్వాత కూడా ఇలా జరిగిందనుకోండి.. అమ్మో.. అనిపిస్తుంది. కానీ.. సరిగ్గా ఇలాగే జరిగినది ఆల్కా యాగ్నిక కి. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సెన్సరీన్యూరాల్ డెఫ్ నెస్.. తద్వారా తన వినికిడి దెబ్బ తిన్నదని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. అతి పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినొద్దనీ, హెడ్ ఫోన్స్ ని సాధ్యమైనంత వరకూ వాడొద్దనీ కూడా ఆమె తన ట్విట్టర్ ద్వారా సూచించారు. ఇంతకీ ఆల్కా ఎవరో తెలుసు కదా.. “టిప్ టిప్ బర్సా పానీ”, “చాంద్ చుపా బాదల్ మే”.. ఇలాంటి ఎన్నో మధురమైన పాటలను తన తియ్యని గొంతు ద్వారా వీనుల విందు చేశారు. 90 వ దశకం లో బాలీవుడ్ పాటలు విన్న వాళ్ళకు, వినే వాళ్ళకు ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సెన్సరీ న్యూరల్ డెఫ్ నెస్ అంటే..?

మన చెవిలో మనకు బాహ్యంగా కనిపించే భాగమే కాకుండా మధ్య చెవి, లోపలి చెవి ఉంటాయి. లోపలి చెవి కాక్లియ లో ఉండే చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు (స్టీరియోసీలియా) ధ్వని తరంగాలను నాడీ సంకేతాలుగా మార్చి, శ్రవణ నాడీ గుండా మెదడుకు పంపిస్తాయి. అలా మనకు వినిపిస్తుంది.

అయితే, మనం 85 డెసిబల్స్ కన్నా ఎక్కువ శబ్దం విన్నప్పుడు సున్నితమైన ఈ స్టీరియోసీలియా దెబ్బతింటాయి. ఇవి ఎంత ఎక్కువగా డ్యామేజీ అయితే అంతా ఎక్కువ వినికిడి లోపిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరగవచ్చు. లేదా నెమ్మదిగా ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ లు, తలకు దెబ్బ తగలడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రక్త ప్రసరణ సమస్యలు, కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ ల వల్ల కూడా సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ జరగవచ్చు.

నివారణ ఎలా ?

ఒకసారి వినికిడి లోపం వస్తే అది పెరగకుండా ఆపగలమే గానీ రివర్స్ చేయలేం. అంతుకే నివారణే ఉత్తమం. అతి పెద్ద శబ్దాల జోలికి వెళ్లొద్దు. హెడ్ ఫోన్స్ వాడకపోవడం మంచిది. వాడినా.. దాని వాల్యూమ్ 60 శాతానికన్నా తక్కువ పెట్టుకోవాలి. తల తిరిగినట్టు ఉన్నా, చెవి-ముక్కు-గొంతుల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా అశ్రద్ద చేయవద్దు.

Latest News