విధాత : రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ” రాజాసాబ్ ” టీజర్ లీక్ పై చిత్ర బృందం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 16న రాజాసాబ్ టీజర్ విడుదల చేశారు. అయితే అధికారికంగా టీజర్ విడుదలకు 3 రోజుల ముందే సోషల్ మీడియాలో టీజర్ లీక్ కావడం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సినిమా డబ్బింగ్ ఇంచార్జి వసంత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని సాగర్ సొసైటీలోని వారాహి స్టూడియోస్‌లో టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ జరిగినట్లుగా పేర్కొన్నారు. అక్కడి నుంచి టీజర్ లీక్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీగా వస్తున్న రాజాసాబ్ ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విడుదలైన రాజాసాబ్ టీజర్ కు 24 గంటల్లో 59 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.