Rajinikanth takes a spiritual break in the Himalayas before resuming ‘Jailer 2’ shoot
న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (విధాత):
Rajnikanth in Himalayas | సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ‘కూలీ’ చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన, జైలర్ 2 షూటింగ్ ప్రారంభానికి ముందు వారం రోజులపాటు హిమాలయాలకు బయలుదేరారు. రిషికేశ్ ఆశ్రమంలో బస చేస్తూ బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ వంటి పవిత్ర స్థలాలను దర్శించిన ఆయన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హిమాలయాల నేపథ్యంలో రజినీకాంత్ ఫొటోలు చూసి అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ప్రతి సంవత్సరం ఒకసారి హిమాలయ యాత్రకు వెళ్లడం తన ఆధ్యాత్మిక సంప్రదాయం అని రజినీకాంత్ అన్నారు. “ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తే కొత్త అనుభవం లభిస్తుంది. ఈసారి కూడా కొత్త ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఎదురు చూస్తున్నాను,” అని పేర్కొన్నారు. “ప్రపంచమంతటికీ ఆధ్యాత్మికత అవసరం. అది మనిషికి తృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది. భగవంతుడి మీద విశ్వాసమే జీవితంలో సమతుల్యతను సాధిస్తుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Video of our #Thalaivar at Badrinath Temple! 🤩❤️🔥@rajinikanth ❤️🔥 #Vettaiyan #Coolie #Rajinikanth pic.twitter.com/DcUkA9BVAW
— 𝐑𝐀𝐓𝐇𝐄𝐄𝐒𝐇 𝐑𝐀𝐉𝐈𝐍𝐈 🤘ॐ (@realrawrathesh1) May 31, 2024
తాజాగా అబుదాబీ పర్యటన ముగించుకుని భారత్‌కు చేరిన రజినీకాంత్, మరుసటి రోజే హిమాలయాలకు బయలుదేరారు. ఈ యాత్రలో ఆయన మహావతార్ బాబాజీ గుహను దర్శించుకున్నారు. హిమాలయాల్లో తపస్సు చేసిన బాబాజీని ఆయన ఎంతో భక్తితో ఆరాధిస్తారు. వారు మహాభినిష్క్రమణం చెందకముందు రజనీ ఎన్నోసార్లు ఆయన అనుగ్రహం పొందారు. వారి ప్రేరణతోనే బాబా సినిమా తీసారు రజనీ. ఈ గుహను సందర్శించడం రజినీకాంత్‌కు చాలా ఇష్టం. ఈసారి కూడా ఆధ్యాత్మిక శాంతి కోసం ఆ గుహలో కొంత సమయం గడిపారని ఆయన సన్నిహితులు తెలిపారు.
‘కూలీ’ చిత్రం తర్వాత రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైలర్’కు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్‌కుమారే తెరకెక్కిస్తున్నారు. ‘కూలీ’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో, ‘జైలర్ 2’ విషయంలో రజినీకాంత్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కూడా ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో చిన్న విరామం తీసుకుని హిమాలయాలకు వెళ్లడం శారీరకంగా, మానసికంగా రిఫ్రెష్ అవడానికి దోహదం చేస్తుందని రజినీ నమ్మకంగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
రజినీకాంత్ హిమాలయాల ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులు పంచుకుంటూ, “నిజమైన సూపర్‌స్టార్ — భక్తి, వినయం, సాధనలో మునిగిపోయిన వ్యక్తి,” అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన ఆధ్యాత్మిక జీవనశైలిని ప్రశంసిస్తూ, “హిమాలయాల్లో రజినీని చూడటం అంటే భగవంతుని దర్శించినట్టే,” అని రాశారు.
హిమాలయ యాత్ర పూర్తయిన తర్వాత రజినీకాంత్ చెన్నైకి తిరిగి వచ్చి ‘జైలర్ 2’ షూటింగ్‌ను పుభించనున్నారు. 74 ఏళ్ల వయసులో కూడా తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికతలను సమానంగా కాపాడుకుంటూ సినిమా కెరీర్‌ను కొనసాగిస్తున్న రజినీకాంత్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించారు.