Site icon vidhaatha

Allu Aravind | అల్లు ఫ్యామిలీకి ఈడీ షాక్..!

⦁ రూ.101 కోట్లు మోసం కేసులో అరవింద్‌కు ఈడీ నోటీసు!
⦁ మూడున్నర గంటలు ప్రశ్నించిన ఈడీ
⦁ నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని: అరవింద్​

Allu Aravind | టాలీవుడ్‌కి అద్దం పట్టే అల్లు ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు ఒక్కసారిగా రూ.101.4 కోట్లు విలువైన బ్యాంక్ మోసం కేసులో వెలుగులోకి రావడం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరవింద్‌ను మూడు గంటలకు పైగా విచారించడంతో, ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కేసు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్‌, రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థల ద్వారా జరిగిన భారీ ఆర్థిక మోసాలకు సంబంధించినదిగా అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యాజ్య ప్రయోజనాల కోసం వినియోగించాయని యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ బెంగళూరులో కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది.

అల్లు అరవింద్ పేరుపై అనుమానాలేంటి?

ఈడీ చేపట్టిన సోదాల్లో హైదరాబాద్, కర్నూలు, ఘాజియాబాద్ సహా అనేక చోట్ల డిజిటల్ పరికరాలు, ఆస్తుల డాక్యుమెంట్లు, విదేశీ లావాదేవీల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.1.45 కోట్లు విలువైన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్‌ను ఈడీ విచారణకు పిలవడం, తనపై ఆధారాలు ఉన్నాయన్న సంకేతాలు బయటపడటం, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ప్రశ్నలు అల్లు ఫ్యామిలీ పరువు, ఖ్యాతిపై ప్రభావం చూపుతాయా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌ను ఈడీ అధికారులు ఆదేశించినట్టు సమాచారం.

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: అరవింద్

ఈ ఉదంతంపై స్పందించిన అరవింద్ “ఇది నేను 2017లో కొనుగోలు చేసిన ఒక ఆస్తికి సంబంధించిన విషయం మాత్రమే. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. కానీ ఈ వ్యవహారాన్ని అనవసరంగా భారీగా చూపుతున్నారు,” అన్నారు. అయితే ఇంకా కేసు విచారణలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు. కాగా, అల్లు అరవింద్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి, అనేక హిట్​ సినిమాలను నిర్మించారు. మెగాస్టార్​ చిరంజీవి సతీమణి సురేఖ, అరవింద్​ సోదరి అన్న విషయం తెలిసిందే. ఆయన ముగ్గురు కుమారుల్లో అల్లు అర్జున్ పాన్​ఇండియా స్టార్ హీరోగా రాణిస్తుండగా.. ఇంకో అబ్బాయి అల్లు శిరీష్ కూడా అడపాదడపా నిమాలు చేస్తున్నారు.

Exit mobile version