విధాత : నటుడు సోనుసూద్ కేవలం సినిమాల్లో తన నటనతోనే కాదు..సామాజిక సేవా కార్యక్రమాలతో అభిమానుల నుంచి రియల్ హీరోగా గుర్తింపు పొందాడు. తాజాగా తనలోని సాహసవంతుడిని..వణ్యప్రాణుల ప్రేమికుడిని కూడా ఆవిష్కరించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ముంబైలో తన నివాసం ప్రాంతంలోకి వచ్చిన ఓ పామును నటుడు సోనుసూద్ ఎలాంటి కర్ర సహాయం లేకుండానే ఒట్టి చేతులతో పట్టుకుని సంచిలో వేసి తాను కేవం రీల్ హీరోనే కాదు..రియల్ హీరో కూడా అని నిరూపించుకున్నాడు. అంతేకాదు తాను పట్టుకున్న ఆ పామును సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టి వాటి మనుగడను దోహదపడాలంటూ పిలుపునిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా సోనుసూద్ స్పందిస్తూ తాను పట్టుకున్న పాము ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిపాడు. అయితే పాముల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని.. పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు నిపుణులైన వారిని పిలిపించి మాత్రమే పట్టుకోవాలని సూచించారు. బంధించిన పాములను సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని..జీవ వైవిధ్యానికి పర్యావరణ సమతుల్యతకు వన్యప్రాణులు, సరిసృపాల పరిరక్షణ కూడా కీలకమని పేర్కొన్నారు. సోనుసూద్ ధైర్యాన్ని, పర్యావరణ బాధ్యతను అభిమానులు ప్రశంసిస్తున్నారు.