Site icon vidhaatha

దాసరి కుమారులపై కేసు

విధాత,బంజారాహిల్స్‌,:అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని భయపెట్టిన ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావుతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా సోమశేఖరరావు వద్ద రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారు.

దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌ 2018 నవంబరు 13న రూ. 2.10 కోట్ల బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి డబ్బు ఇవ్వలేదు. సోమశేఖరరావు ఈ నెల 27న జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌ను డబ్బులు ఇవ్వమని అడిగారు. మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు ఆయనను భయపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version