Site icon vidhaatha

Megastar Chiranjeevi | మెగాస్టార్​ చిరంజీవికి అద్భుత గౌరవం..గిన్నీస్​ బుక్​లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి – మూడున్నర దశాబ్థాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న పేరు. కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా, అత్యున్నత  స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఆయనను అందరివాడిని చేసింది. డ్యాన్సులు, ఫైట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ లుక్​ను మార్చిన మెగాస్టార్ కిర్తీ కిరీటంలో తాజాగా మరో మణిరత్నం చేరింది.

Megastar Chiranjeevi – మెగాస్టార్​ చిరంజీవికి అత్యధిక చిత్రాల్లో పేరొందిన డాన్స్​ మూవ్​మెంట్స్​ చేసినందుకు గానూ గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్(Guinness Book of World Records) ​లో చోటు దక్కింది. ప్రపంచంలో  ఒక నటుడికి ఇటువంటి అవార్డు రావడం ఇదే తొలిసారి. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్(Bolywood Star Amir Khan) సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు.

156 చిత్రాలు..

537 పాటలు…

24,000 డాన్స్​ మూవ్​మెంట్స్​…

1978లో పునాదిరాళ్లు చిత్రంలో సినీరంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి. సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్‌గా ఇలా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’తో చిరంజీవి క్రేజ్​ అమాంతం పెరిగింది. అప్పటికే డ్యాన్స్​లతో పేరు తెచ్చుకున్న చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగువారికి పరిచయం చేశారు. నాటి నుంచి నేటి వరకు వందల సినిమాలలో తన స్టెప్స్‌లో అభిమానులను ఉర్రూతలూగించారు. చిరంజీవి మెగాస్టార్ కావడంలో డ్యాన్సులు ముఖ్య భూమిక పోషించాయనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవే . దీంతో నాటి పత్రికలు, మ్యాగజైన్స్‌ ఆయనను బిగ్గెర్ దెన్ బిగ్ బీ (Bigger than Big B)అంటూ కీర్తించాయి.

తొలి రోజుల్లో సుప్రీం హీరో(Supreme Hero)గా అభిమానుల చేత పిలిపించుకున్న చిరు.. మరణ మృదంగం నుంచి మెగాస్టార్‌(Mega Star)గా మారారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవి.

కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు(4 Nandi Awards), 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు(9 Filmfare Awards), ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. సినీరంగానికి అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్(Padma Bhushan), పద్మవిభూషణ్‌(Padma Vibhushan)లతో చిరంజీవిని గౌరవించింది భారత ప్రభుత్వం.  నటసామ్రాట్​ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును చిరంజీవికి ప్రకటించారు అక్కినేని నాగార్జున . తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేశారు. బ్లడ్​ బ్యాంక్​, ఐ బ్యాంక్​ నెలకొల్పి, అవసరమైన వారికి తక్షణం వాటికి అందిస్తున్నారు. ఇప్పటికీ సినీ కళాకారులు, సామాన్యులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించి మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులకు ఎన్నోసార్లు విరివిగా విరాళాలు అందించారు.

తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో వజ్రం  చేరింది. ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి స్థానం సంపాదించారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలలో, అత్యధిక డ్యాన్స్​ మూవ్​మెంట్స్​ చేసి చిరంజీవి అరుదైన రికార్డు సాధించారు.  హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్​ఖాన్ చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం(Most Prolific Film Star  in Indian Film Industry ACTOR/DANCER) అందుకున్నారు చిరు. చిరంజీవికి ఈ పురస్కారం తన చేతుల మీదుగా అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమిర్​ఖాన్​ తెలిపారు.  ఇంతటి ప్రతిష్టాత్మక గౌరవం పొందిన నేపథ్యంలో చిరంజీవిపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో న‌టిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Tags:

 

Exit mobile version