విధాత : ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా(Tribandhari Barbarik) తెలుగు ప్రేక్షకులను ఓటీటీ(OTT Release) ద్వారా అలరించబోతుంది. సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ బ్యాక్ గ్రౌండ్ హారర్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ డిఫరెంట్ టైటిల్‍తో ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆశించిన విజయాన్ని అందుకోలేకపో్యింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స థియేటర్లకు పబ్లిక్ రావడం లేదని కన్నీళ్లు పెట్టుకుని…తను చెప్పిన మాట ప్రకారం చెప్పుతో కొట్టుకుని సెల్ఫీ వీడియోతో సంచలనం రేపారు. ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి సన్ నెక్ట్స్‌లో (Sun NXT)స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘ప్రేమ, నష్టం, విడదీయరాని బంధం – తన మనవరాలిని కొనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం.’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దర్శకుడు అంచనాలు ఎక్కడ తప్పాయో?
ట్రైలర్ తో మంచి అంచనాలు అందుకున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ విడుదల తర్వాత దర్శకుడి నమ్మకానికి భిన్నంగా థియేటర్లలో ఆశించిన ప్రేక్షకాదరణ సాధించడంలో ఎందుకు విఫలమైందన్న ప్రశ్న..అప్పట్లో శ్రీవత్స చెప్పు దెబ్బల వీడియోతో చాల మంది ప్రేక్షకుల బుర్రలను తొలిచివేసింది. అందుకు సమాధానాలు వెతుక్కోవాలనుకుంటే ఓటీటీలో ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ చూసేయచ్చు. సినిమా కథలోకి వెళితే శ్యామ్ కతు (సత్యరాజ్) పేరు మోసిన మానసిక వైద్య నిపుణుడు. కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన)ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటాడు. ఓరోజు స్కూల్‌కు వెళ్లిన ఆ పాప కనిపించకుండా పోతుంది. దీంతో శ్యామ్ పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. శ్యామ్ మనవరాలు కనపడకపోవడానికి కారణమెవరు? దీనికి ఆ ఊరిలో ఉన్న రామ్ (వశిష్ఠ ఎన్ సింహా), లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను)కు ఏమైనా సంబంధం ఉందా? డబ్బు కోసం వీళ్లిద్దరూ చేస్తున్న అక్రమ కార్యకలాపాలేంటి? ఆఖరికి తన మనవరాలి మిస్సింగ్ కేసును శ్యామ్ ఛేదించాడా? అసలు ఈ కథకు బార్బరికుడికి సంబంధం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.