Site icon vidhaatha

ఆటోతో ఢీకొట్టి ..జాగింగ్‌ వెళ్తున్న న్యాయమూర్తి దారుణ హత్య

విధాత,రాంచీ:ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలీసులు కథనం ప్రకారం..
జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్‌ చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్‌ చేసుకుంటూ వెళ్తుండగా.. ఓ ఆటో వచ్చి ఆయనకు ఢీకొట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ న్యాయమూర్తి కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఓ జడ్జి అని తెలియకపోవడంతో కొన్ని గంటల వరకు ఆయన మృతి విషయం బయటకు రాలేదు.
ఉదయం 7 గంటలవుతున్నా జస్టిస్‌ ఆనంద్‌ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే గాలింపు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడిన ఆసుపత్రిలో మరణించినట్లు తెలిసింది. దీంతో హిట్‌ అండ్‌ రన్‌గా పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. వాహనంలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఢీకొట్టినట్లు తెలియడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు.

Exit mobile version