Site icon vidhaatha

కరీంనగర్‌లో కాల్పుల కలకలం..

విధాత,కరీంనగర్‌: కరీంనగర్‌లో శుక్రవారం రాత్రి ఒక టీఆర్‌ఎస్‌ నాయకుడు కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. షాషామహల్‌ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఐదుగురు సోదరుల మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్నది. టీఆర్‌ఎస్‌ నాయకుడు అయిన సయ్యద్‌ అజ్గర్‌ హుస్సేన్‌(పెద్ద సోదరుడు) రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని చిన్న సోదరుడు సయ్యద్‌ షహీల్‌ హుస్సేన్‌పై మొదట కత్తితో దాడి చేయగా మిగతా ముగ్గురు సోదరులు అడ్డుకోబోయారు. దీంతో అజ్గర్‌హుస్సేన్‌ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో వారిపై రెండు సార్లు కాల్పులు జరిపాడు. అయితే కాల్పుల నుంచి నలుగురు తప్పించుకోగా రెండు బుల్లెట్లు అజ్గర్‌ కారుకే తగిలాయి. కాగా సంఘటనా స్థలాన్ని కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ ఎస్‌ శ్రీనివాస్‌, సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌లు సందర్శించి విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపిన అజ్గర్‌తోపాటు అతని సోదరులను కరీంనగర్‌ ఒకటో ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. బుల్లెట్‌ తగిలిన కారుతోపాటు కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రివాల్వర్‌ కోసం వెదుకుతున్నారు. అజ్గర్‌హుస్సేన్‌ వద్ద పీపుల్స్‌ న్యూస్‌ సర్వీస్‌ సబ్‌ఎడిటర్‌ పేరిట ఒక ప్రెస్‌ గుర్తింపు కార్డు కూడా లభించింది. ఐదుగురు సోదరులు ప్రస్తుతం షాషామహల్‌ ప్రాంతంలోని వాసవిటవర్స్‌ ముందు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు.

కమాన్‌ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లే రోడ్డులోనే ఐదుగురికి షటర్స్‌ ఉన్నాయి. ఈ ఆస్తి దాదాపు 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఉమ్మడి ఆస్తిని అజ్గర్‌ హుస్సేన్‌ ఒక్కడే కాజేయాలని చూస్తున్నట్లు అతని సోదరులు ఆరోపిస్తున్నారు. ఇదివరకే బైపాస్‌రోడ్డులో ఉన్న 2 ఎకరాల భూమిని అమ్ముకుని మాకు డబ్బులు ఇవ్వలేదని దీంతో అజ్గర్‌హుస్సేన్‌కు మిగతా నలుగురు సోదరులు సయ్యద్‌ ఆల్తాఫ్‌ హుస్సేన్‌, సయ్యద్‌ సహీద్‌ హుస్సేన్‌, సయ్యద్‌ అఖిల్‌ హుస్సేన్‌, సయ్యద్‌ షహీల్‌ హుస్సేన్‌లకు మధ్య వివాదం నడుస్తున్నది. రెండు రోజులుగా ఈ వివాదం గురించి కరీంనగర్‌ ఒకటో ఠాణాకు కూడా బాధితులు వెళ్లారు. కాల్పులకు ముందు అజ్గర్‌ హుస్సేన్‌కు మిగతా నలుగురు సోదరులకు మధ్య ఘర్షణ జరగగా అజ్గర్‌ హుస్సేన్‌కు గాయాలయ్యాయి. అజ్గర్‌ హుస్సేన్‌ను కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రివాల్వర్‌ తాము స్వాధీనం చేసుకోలేదని పోలీసులు చెప్పటం అనుమానాలకు తావిస్తున్నది. కారు అద్దాలు రెండుచోట్ల బుల్లెట్‌తో పగిలిపోయాయి. సోదరుల మధ్య గొడవ, కత్తితో దాడి జరిగిన మాట వాస్తవమే కానీ రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లుగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కరీంనగర్‌ సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌ తెలిపారు. కారు అద్దాలు రెండు చోట్ల పగిలి ఉన్న దానిపై సాంకేతికపరంగా ప్రాథమికంగా విచారణ జరపగా బుల్లెట్‌ మూలంగా కారు అద్దాలు పగిలినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. నలుగురు సోదరులు కలిసి అజ్గర్‌హుస్సేన్‌నే కొట్టారని ఆయన తెలిపారు. ఇరువర్గాలపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

Exit mobile version