Site icon vidhaatha

యుక్తవయసుకు వచ్చిన కూతురితో చనువుగా ఉంటూ.. నీలిచిత్రాలు చూపించి..

విధాత:రప(తూర్పు గోదావరి): కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మానవత్వం మరిచి ఒక మృగంలా కన్న కూతురునే చెరిచి మానవజాతికి తీరని కళంకం తీసుకువచ్చాడు. ఆ రాక్షసుడి కామ దాహానికి అభం శుభం తెలియని బాలిక గర్భం దాల్చి ప్రాణాపాయస్థితికి చేరుకుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన కసాయిని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలిసిన కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఎస్‌ఐ డి.రమేష్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు.

రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లిలంక గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహమైంది. ఆరేళ్లు అత్తారింటి వద్దే ఉన్న అతడు బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి హైదరాబాద్‌ ఫిలింనగర్‌ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఒక అపార్ట్‌మెంటులో అతడు వాచ్‌మన్‌గా, భార్య ఇళ్లల్లోను పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో భర్త యుక్తవయసుకు వచ్చిన కూతురితో చనువుగా ఉంటూ ఆమెకు నీలిచిత్రాలు చూపించేవాడు. ఈ క్రమంలో కన్న కూతురు అని కూడా చూడకుండా పలుమార్లు శారీరకంగా అనుభవించేవాడు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరించడంతో హడలిపోయిన కూతురు మౌనంగా రోధించేది.

నెలలు గడిచేకొద్దీ కూతురిలోని శారీరక మార్పులను, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలను గమనించిన తల్లి ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించింది. ఐదు నెలల గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించడంతో తల్లి, కూతురు హతాశులయ్యారు. విషయం బయటపడడంతో అతడు రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి కరప మండలం వేములవాడ వచ్చేసి బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నాడు. కూతురికి జరిగిన ఘోరాన్ని కన్నతల్లి సిరిగలపల్లిలంకలోని పుట్టింటి వారికి చెప్పడంతో బంధువులు, పలువురు గ్రామస్తులు అతడి కోసం గాలించారు. ఆదివారం ఉదయం వేములవాడలో ఉన్నట్టు సమాచారం అందడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని వాకాడ బస్టాండ్‌ వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి చితకబాదారు. విషయం తెలుసుకున్న కరప పోలీసులు అక్కడకి వచ్చి నిందితుడిని విడిపించి స్టేషన్‌కు తరలించారు. ఈ కీచకపర్వమంతా హైదరాబాద్‌లో జరగడంతో బాధితులు అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంది. అప్పటివరకు నిందితుడిని తమ కస్టడీలో ఉంచుకుని హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తామని ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ వెల్లడించారు.

Exit mobile version