Site icon vidhaatha

ఘోర రోడ్డు ప్రమాదం

విధాత:ధర్మవరం మండలం మోటుమర్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ధర్మవరానికి చెందిన అంకే ధనుష్‌(24), అనిల్‌కుమార్‌(27) మృతి చెందారు. రాజేంద్రనగర్‌, రామ్‌నగర్‌కు చెందిన వారిద్దరూ స్నేహితులు. చేనేత మగ్గాలను ఏర్పాటు చేసుకొని పట్టుచీరల వ్యాపారం నిర్వహిస్తున్నారు.ఆదివారం పని నిమిత్తం గోరంట్ల వెళ్లి ద్విచక్రవాహనంలో ధర్మవరం వస్తుండగా అనంతపురం నుంచి పుట్టపర్తి వెళుతున్న పుట్టపర్తి ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అమావాస్య రోజు బయటికి వద్దన్నా వినకుండా వెళ్లి కానరాని లోకాలకు చేరితివా అంటూ ధనుష్‌ తల్లిదండ్రులు నారాయణస్వామి, గాయత్రి దంపతులు విలపించటం అక్కడున్నవారిని కలచివేసింది. వారికి ఇంకో కుమార్తె ఉంది.రంగస్వామి, జయమ్మ దంపతులకు కుమారుడు అనిల్‌కుమార్‌తోపాటు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.ఘటనా స్థలాన్ని ధర్మవరం గ్రామీణ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్‌ ఆదోని, సీటీఎం గోపాల్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌కుమార్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు.

Exit mobile version