Site icon vidhaatha

UP: Honour Killing | IAS కోసం సిద్ధమవుతున్న చెల్లెల్ని హత్య చేసిన సోదరుడు : పరువు హత్యగా అనుమానం

ఉపాధ్యాయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న IAS అభ్యర్థిని స్వంత తల్లి, సోదరుడు కలిసి కాల్చిచంపారు. హర్డోయ్‌లో పరువు హత్యగా పోలీసులు కేసు నమోదు చేసారు.

ఉత్తర ప్రదేశ్‌లో మానవీయ విలువలను కలవరపరిచే ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. IAS పరీక్షలకు సిద్ధమవుతున్న 24 ఏళ్ల మాన్వి మిశ్రా అనే యువతి, తన స్వంత కుటుంబ సభ్యుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఇది పరువు హత్య కేసు కావచ్చని భావిస్తున్నారు.

హర్డోయ్ జిల్లా, అలియాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఇంట్లో మాన్వి మృతదేహం కనుగొన్నారు. తొలుత కుటుంబ సభ్యులు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పగా, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిజం బయటపెట్టాయి. తలలో ఎడమ వైపు బుల్లెట్‌ దూరినట్లు రిపోర్టులో తేలింది. అయితే తుపాకీ మాత్రం మాన్వి కుడి చేతిలో ఉండటంతో పోలీసులు అనుమానించారు.

మాన్వి మిశ్రా, ఈ సంవత్సరం జనవరిలో అర్యసమాజ్‌ విధానంలో బరేలీకి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ అభినవ్‌ కటియార్‌ను వివాహం చేసుకుంది. వివాహం రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. కానీ, కుటుంబం ఈ పెళ్లిని అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత కూడా మాన్వి తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి UPSC పరీక్షల కోసం ప్రిపేరవుతోంది.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. మాన్వి సోదరుడు అశుతోష్‌ మిశ్రా, తల్లితో కలిసి కుట్ర పన్ని, నాటు తుపాకీతో ఆమెను కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఈ సంఘటనను ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు.

వివాహ నిర్ణయం వ్యక్తిగత హక్కు అయినా, సమాజపు ఒత్తిళ్లు, కుటుంబ గౌరవం పేరుతో ఇలాంటి పరువు హత్యలు (Honour Killings) ఇంకా జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. IAS కలలు కన్న మాన్వి మిశ్రా జీవితం కుటుంబ హింసతో ముగియడం దురదృష్టకరం.

Exit mobile version