Site icon vidhaatha

Viral video | కారు అటల్‌ సేతు వంతెనపై ఆపి.. అమాంతం బ్రిడ్జిపై నుంచి సముద్రంలో దూకి.. ఇంజినీర్‌ ఆత్మహత్య..!

Viral video : అతనొక ఇంజినీర్‌..! ఏం కష్టం వచ్చిందో ఏమో..? ఇంటి నుంచి అర్ధరాత్రి 11.30 గంటలకు కారులో బయటికి వచ్చాడు..! ఎక్కడెక్కడ తిరిగాడో తెలియదు..! మరుసటి రోజు మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్‌సేతు వంతెనపైకి చేరుకున్నాడు..! కారు ఆపి కిందకు దిగాడు..! డోర్‌ మూసి, వంతెనపై నుంచి అమాంతం సముద్రంలోకి దూకేశాడు..! మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు రోజుల క్రితం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది..! వంతెనపై ఉన్న సీసీ కెమెరాలో ఇంజినీర్‌ ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి..! ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..!

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో స్థిర‌ప‌డిన హైద‌రాబాద్‌ బండ్ల‌గూడ‌కు చెందిన 38 ఏళ్ల ఎం శ్రీనివాస్‌ వృత్తిరీత్యా ఇంజినీర్‌. ఆయన గతంలో కొన్నేళ్లు దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసి వచ్చాడు. ముంబైలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్‌కు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, దాంతో ఆర్థికంగా సమస్యలు చుట్టముట్టాయని, ఈ కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం రాత్రి 11.30 గంటలకు ఆయన కారు తీసుకుని బయటికి వెళ్లారని, బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ చేసి తనతో, తన కుమార్తెతో మాట్లాడారని, ఆ తర్వాత కొంతసేపటికే ఆయన మరణవార్త వినాల్సి వచ్చిందని శ్రీనివాస్‌ భార్య విలపిస్తూ చెప్పారు. శ్రీనివాస్‌ సముద్రంలో దూకినప్పటి నుంచి స్థానిక పోలీసులు, అటల్ సేతు రెస్క్యూ బృందం, మత్స్యకారులు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయినా ఆయన జాడ తెలియకపోవడంతో గాలింపు కొనసాగుతున్నది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version