Akshardham Temple | దేవాలయాలు అనగానే అందరికీ భారతదేశమే గుర్తుకు వస్తుంది. హిందూ మతానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. వీటికి ఎంతో చరిత్ర ఉన్నది. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద రెండు హిందూ దేవాలయాలు మాత్రం భారతదేశంలో లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కంబోడియాలో ఉన్న అంగ్కోర్ వాట్ దేవాలయం. ఆ ఆలయం 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. యూనెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇక రెండో అతిపెద్ద దేవాలయం అమెరికాలోని నూజెర్సీ రాబిన్స్‌విల్లేలో ఉన్నది. ఈ ఆలయం స్వామినారాయణ అక్షరధామ్. న్యూయార్క్ నగరానికి దక్షిణంగా 99 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆలయాన్ని మహంత్ స్వామి మార్గదర్శకత్వంలో నిర్మించగా.. గతేడాది అక్టోబర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆలయం 183 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఎత్తు 42 అడుగులు, వెడల్పు 87 అడుగులు, పొడవు 133 అడుగులు ఉంటుంది. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. దాదాపు ఆలయ నిర్మాణానికి సుమారు పుష్కరకాలం పట్టింది. 2011లో నిర్మాణం ప్రారంభించగా.. 2023 వరకు అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన 12వేల మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆలయ నిర్మాణంలో సుమారు 10వేల విగ్రహాలను వాడారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలను అందంగా మలిచారు.
అక్షరధామ్ ఆలయం నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, తొమ్మిది శిఖరాలు, తొమ్మిది పిరమిడ్ శిఖరాలు ఉన్నాయి. ఈ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్ప.. అతిపెద్ద దీర్ఘవృత్తాకార గోపురం ఉంది. ఇది వెయ్యి సంవత్సరాలు ఉండేలా తీర్చిదిద్దారు. సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుకరాయి, పాలరాయితో సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. అవి భారతదేశం, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు. ఆలయం వద్ద బ్రహ్మకుండ్ పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో భారత్, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను అందులో కలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో సైతం అక్షరధామ్ దేవాలయం వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న విషయం తెలిసిందే.