Famous Rama Temple | తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరాముడి ప్రముఖ ఆలయాలు ఇవే.. వాటి విశిష్ఠతల గురించి తెలుసా..?

Famous Rama Temple | మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడు హిందువులందరికీ ఆరాధ్యదైవం. ‘రామ’ అనే రెండు అక్షరాలను పలికినంత మాత్రానే కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు.. రాముని ఆరాధించని భక్తుడు ఉండడు’ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు ఎన్నో ఉన్నా పలు ఆలయాలు మాత్రం మరింత ప్రాముఖ్యం ఉన్నది. ఆ ఆలయాలు విశేషాలు ఏంటో చూద్దాం..!

  • Publish Date - April 17, 2024 / 07:15 AM IST

Famous Rama Temple | మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడు హిందువులందరికీ ఆరాధ్యదైవం. ‘రామ’ అనే రెండు అక్షరాలను పలికినంత మాత్రానే కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు.. రాముని ఆరాధించని భక్తుడు ఉండడు’ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు ఎన్నో ఉన్నా పలు ఆలయాలు మాత్రం మరింత ప్రాముఖ్యం ఉన్నది. ఆ ఆలయాలు విశేషాలు ఏంటో చూద్దాం..!

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం..

తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదీ తీరాన శ్రీరాముడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం క్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడి తపస్సుకి మెచ్చి తనకి ఇచ్చిన వరం ప్రకారం శ్రీరాముడు.. సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఓ రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడు. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం.. భద్రగిరిపై కొలువుదీరి ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు సైతం సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పి అంతర్థానమయ్యాడు. దాంతో దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించి అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చింది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో రాముడికి ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడు. ఏటా ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణాన్ని చూడాల్సిందే తప్ప. మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఎత్తయిన గోపురాలు, విశాలమైన ఆలయ రంగమంటపం, శిల్పకళా వైభవం దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవు. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించినట్లుగా స్థలపురాణం చెబుతున్నది. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం. హనుమంతుడు రాముడిని కలిసేందుకు మునుపే ఈ ప్రాంతంలో రాముడు సంచరించినట్లుగా తెలుస్తున్నది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి కనిపించడు. ఇక్కడ శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రుడికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. శ్రీరామనవమి తర్వాత వచ్చే పున్నమి వెలుగుల్లో ఇక్కడ కల్యాణ వేడుక జరుగుతుంది.

రామతీర్థం రామస్వామి ఆలయం..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో రామతీర్థం ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 ఏడీ మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడో చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతున్నది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్లీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరాముడితో సహా ఇతర దేవతా మూర్తులు విగ్రహాలు లభించాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించారు. చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం పేరువచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు… ఆలయ నిర్వహణకోసం కొన్ని భూములు ఇనాంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవునా 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపై సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు సైతం నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

గొల్లల మామిడాడ కోదండ రామాలయం

ఏపీలోని కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడను గోపురాల మామిడాడగానూ పిలుస్తారు. ఇక్కడ 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయాలయాలున్నాయి. ఈ గ్రామంలోకి అడుగుపెడుతూనే ఎన్నో గోపురాలు దర్శనమిస్తుంటాయి. ఇక్కడున్న దేవాలయాలు వందేళ్ల క్రితం అప్పటి జమిందార్లు నిర్మించారని చెబుతారు. 1889లో ద్వారంపూడి సుబ్బి రెడ్డి, రామిరెడ్డి అనే సోదరులు భూమిని విరాళంగా ఇచ్చి రాముడు, సీత చెక్క విగ్రహాలతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1939లో ఒక పెద్ద ఆలయం నిర్మించారు. తూర్పు, పడమర గోపురాలు వరుసగా 1948-50, 1956-58లో నిర్మించారు. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలంగా పిలుస్తుంటారు. శ్రీరామ నవమి ఆలయంలో జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండుగ. సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా జరుపుతారు. అలాగే వైకుంఠ ఏకాదశి, విజయదశమి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తారు.

డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం

ప్రముఖమైన క్షేత్రాలలో అరుదైన ఆలయం డిచ్ పల్లి ఖిల్లా రామాలయం. ‘తెలంగాణ ఖజురహో’గా పేరొందిన ఈ ఆలయం నిజామాబాద్‌కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దాని శైలి, నిర్మాణంలో చాలా పోలికలను కలిగి ఉన్నందున, దీన్ని ఇంధూర్ ఖజురహో, నిజామాబాద్ ఖజురహో అని కూడా పిలుస్తారు. దీనినే ఖిల్లా రామాలయం అని కూడా పిలుచుకుంటారు. ఈ ఆలయంపై భాగాన, చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయన కామసూత్రల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ‘ఖజురహో’ను గుర్తుకు వచ్చేలా చేస్తాయి. ఈ ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు ‘గిచ్చు బొమ్మలు’గా పిలిచేవారని, సంస్కృతంలో ‘గిచ్చు’ శృంగారానికి పర్యాయ పదం కావడంతో ఈ ఊరుని ‘గిచ్చుపల్లి’ అని, అదే ‘డిచ్ పల్లి’గా మారిందని అంటారు. ఆలయం లోపల, వెలుపల గోడలపై ఉన్న ప్రతి చెక్కడం కాకతీయ వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆలయాన్ని శ్రీరామ నవమి పండుగ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు దర్శిస్తారు.

శంషాబాద్ అమ్మపల్లి రామాలయం

శంషాబాద్‌లో ఉన్న అమ్మపల్లి సీతా రామ చంద్ర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దం నాటికి చెందింది. స్థల పురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఆలయాన్ని నిర్వహించారు. ఈ ఆలయం దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే శిల్పాలతో ఉంటుంది. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. సీతారామలక్ష్మణుల ప్రతిమలు శిలా మకరతోరణాలను కలిగివుండడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతారు. ముఖమంటపంలో ‘కూర్మం’ (తాబేలు) ఏర్పాటు చేయబడి ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఈ గుడి సినిమావారికి ఓ సెంటిమెంట్‌గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు.

వాయల్పాడు పట్టాభిరామాలయం..

ఏపీలోని అన్నమయ్య జిల్లా ‘వాయల్పాడు’లో వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ పుట్టలోంచి బయటపడిన సీతారాముల విగ్రహాలనే ఆలయంలో ప్రతిష్టించారని చెబుతారు. ‘వల్మీకం’(పుట్ట) నుంచి రాముడు ఆవిర్భవించాడు కాబట్టి.. ఈ ప్రాంతానికి ‘వాల్మీకిపురం’ అని పిలుస్తారు. ఇక్కడ బోయలు ఎక్కువగా నివసించడం వలన ‘బోయలపాడు’ అని కూడా పిలిచేవాళ్లు. కాలక్రమంలో ఈ రెండూ కలిసి వాల్మీకపాడుగా.. వాయల్పాడుగా ప్రసిద్ధి చెందింది. అన్నమయ్య కూడా ఇక్కడి స్వామిని దర్శించి అనేక కీర్తనలతో అభిషేకించినట్టు ఆధారాలున్నాయి. విశాలమైన ప్రాంగణం.. ఎత్తయిన రాజగోపురం, పొడవైన ప్రాకారాలతో ఆలయం అందంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. ఇక్కడి రాజగోపురాన్ని ఓ ఆంగ్లేయ అధికారి స్వామివారిపై భక్తితో నిర్మించడం విశేషం. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో వాల్మీకి, రుక్మిణీ – సత్యభామా సమేత శ్రీ కృష్ణుడు, శ్రీదేవి – భూదేవి సమేత రంగనాథుడు, అనంతపద్మనాభ స్వామిని సైతం దర్శించుకోవచ్చు.

Latest News