ధాత:కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఇక విశాఖ సాగరతీరంలో కొలువుదీరబోతున్నాడు. రిషికొండల్లో ఒకటైన పర్యతంపై సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టీటీడీ దేవాలయం కోసం 10 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. 10 ఎకరాల్లో ఏర్పాటుచేసిన దేవాలయంలో ఈ నెల 11న దేవదేవుని విగ్రహ ప్రతిష్ట జరగనుంది. 8న అంకురార్పణ, 13న సంప్రోక్షణ జరగనుంది. ఇక ఆ తర్వాత 13న మధ్యాహ్నం నుంచి భక్తులకు దేవదేవుని దర్శనం లభించనుంది. 28కోట్ల రూపాయల వ్యయంతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని.. తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ. ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.
తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీవారికి పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం.. దానికి ఎదురుగా టీటీడీ ఈ-దర్శనం కౌంటర్ ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆలయ పనులు కంప్లీట్ అవ్వడంతో.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది శ్రీవారి ఆలయం. వివిధ కారణాల వల్ల తిరుమల వెళ్లలేనివారు.. విశాఖలోనే దేవదేవుడుని దర్శించుకోవచ్చు. ప్రసాదాలు పొందవచ్చు.. ప్రత్యేక పూజులు చేయించుకోవచ్చు. మెుత్తంగా తిరుమల వెంకన్న విశాఖలోనే దర్శనం ఇవ్వనుండటంతో.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు.