Site icon vidhaatha

Tirumala | తిరుమలలో ఈ నెల 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. రెండురోజులు బ్రేక్‌ దర్శనాలు రద్దు..

Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనున్నది. ఈ నెల 16న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.

తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 16న జరిగే సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా రెండురోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. దాంతో ఈ నెల 8, 15 తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవని దేవస్థానం పేర్కొంది. ఈ మేరకు భక్తులు విషయాన్ని గమనించి.. సహకరించాలని కోరింది.

Exit mobile version