Site icon vidhaatha

Tirumala | తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై విహరించిన మలయప్ప

Tirumala | తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనిమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. నేటి రాత్రి 7 గంటలకుకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి అనుగ్రహించనున్నారు.

Exit mobile version