Site icon vidhaatha

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నవంబర్‌ నెల ఆర్జిత సేవ టికెట్లు 19న రిలీజ్‌..!

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్‌ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. టికెట్లు పొందిన వారంతా 21 నుంచి 23 వరకు మధ్యాహ్నం 12గంటల్లోగా డబ్బులు చెల్లిస్తే లక్కీడీప్‌ టికెట్లు మంజూరుకానున్నాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబర్‌ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను 22న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి.

ఇక అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆన్‌లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తిరముల శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్‌ నెల ఉచిత ప్రత్యేక దర్శనం కోటా టిక్లెను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చెప్పింది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

Exit mobile version