Site icon vidhaatha

After 10th Class | పదో తరగతి తర్వాత పయనమెటు.. ఏం చదివితే బాగుంటుంది..?

After 10th Class : ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి తర్వాత ఏం చేయాలి..? ఇంటర్మీడియట్ చదవాలా.. ఇంజినీరింగ్‌కు మార్గమైన పాలిటెక్నిక్‌లో చేరాలా.. లేదంటే సత్వర ఉద్యోగం కోసం ఐటీఐ చేయాలా..? అనే ప్రశ్నలు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సుల స్వభావం ఏమిటి..? ఎవరికి ఏ కోర్సులు బెస్ట్‌..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్మీడియట్‌..

సాధారణంగా పదో తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఎంపీసీ, బైపీసీల్లో చేరి భవిష్యత్తులో ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదవాలనే ఆలోచనతో అధికంగా ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం సత్వరం ఉపాధి కల్పించే ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంటర్మీడియట్‌ ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), సీఈసీ (CEC), హెచ్‌ఈసీ (HEC), ఎంఈసీ (MEC) కోర్సులలో ప్రతి గ్రూప్‌ దేనికదే ప్రత్యేకమైనవి. ఎక్కువగా ఎంపీసీలో చేరుతున్నారు. ఆ తర్వాత బైపీసీ, ఎంఈసీతోపాటు సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లకు డిమాండ్‌ ఉంది. అదేవిధంగా టెక్నికల్‌ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలు అందించే ఒకేషనల్‌ కోర్సులకూ డిమాండ్‌ పెరుగుతోంది.

ఇంజినీరింగ్‌కు కేరాఫ్‌ MPC

ఎంపీసీ (MPC)..! మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉండే గ్రూప్‌ ఇది. ఈ గ్రూప్‌తో ఈఏపీసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శ్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ల ద్వారా రక్షణ రంగంలో కెరీర్‌కు ప్రయత్నించవచ్చు. భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రిసెర్చ్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. కంప్యూటేషనల్‌ స్కిల్స్, న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉన్నవాళ్లు, అదేవిధంగా మన కళ్ల ముందు కనిపించే గ్యాడ్జెట్స్ గురించి, వాటి పనితీరు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వాళ్లు పై కోర్సులలో రాణించగలరు.

BiPC లో అవకాశాలు భళా

ఎంపీసీ తర్వాత ఎక్కువ మంది ఎంచుకునే గ్రూప్‌ బైపీసీ (BiPC)..! ఈ గ్రూప్‌తో జాతీయస్థాయిలో నిర్వహించే నీట్‌-యూజీ ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. రాష్ట్రస్థాయిలో ఈఏపీ సెట్‌ (అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌) లో ర్యాంకు సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరే వీలుంది. సాధారణ బీఎస్సీ డిగ్రీ చేసే అవకాశం ఉంది. బీఎస్సీలో ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, హ్యూమన్‌ జెనెటిక్స్, జెనెటిక్స్‌ లాంటి వినూత్న సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పూర్తిచేస్తే ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి. లైఫ్‌ సైన్సెస్‌పై సహజ ఆసక్తితోపాటు జీవులు, పరిసరాలు, పర్యావరణంపై ఆసక్తి కలిగి ఉన్నవాళ్లు ఈ కోర్సుల్లో రాణించగలుగుతారు.

కార్పొరేట్‌ కెరీర్‌కు CEC

కార్పొరేట్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి సీఈసీ (CEC) చక్కటి మార్గం. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్టుల కలయికగా ఉండే గ్రూప్‌ ఇది. ఇంటర్మీడియట్‌లో సీఈసీ కోర్సు పూర్తిచేస్తే ఆ తర్వాత బీకామ్‌ డిగ్రీ చదవచ్చు. బీకామ్‌ చదువుతూనే చార్టర్డ్‌ అకౌంటెన్సీ (CA), కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ (CS) లాంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కంపెనీల్లో ఇంటర్నల్‌ ఆడిటర్స్, స్టాక్‌ ఆడిటర్స్, ఫైనాన్షియల్‌ మేనేజర్స్, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీస్‌ వంటి వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత పీజీ స్థాయిలో ఎంకామ్, ఎంబీఏలో చేరే వీలుంది. ముఖ్యంగా అకౌంటింగ్‌ రంగంలో రాణించాలనుకునే వారు ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తి చేయవచ్చు. కాలిక్యులేషన్‌ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ, సూక్ష్మ స్థాయి పరిశీలన, వ్యాపార, వాణిజ్యాలపట్ల ఆసక్తి కలిగిన వాళ్లకు పై కోర్సులు బాగా సూటవుతాయి.

కాంపిటీటివ్‌ కింగ్‌ HEC

హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్ట్‌లుగా ఉండే హెచ్‌ఈసీపై పట్టు సాధించడం ద్వారా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్, గ్రూప్స్‌ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న వారికి ఈ గ్రూప్‌ అనుకూలంగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో బీఏలోనూ పలు జాబ్‌ ఓరియెంటెడ్‌ గ్రూప్‌ కాంబినేషన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు.

గురుకులాల్లో ఫ్రీగా ఇంటర్

పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌కు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు కూడా చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. వాటిలో ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయిలో RJC సెట్‌ల పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏపీఆర్‌జేసీ సెట్‌ నిర్వహిస్తారు. ఈ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌తోపాటు నీట్‌ యూజీ, ఐఐటీ జేఈఈల్లో ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ కూడా లభిస్తుంది.

ఇంజినీరింగ్‌కు మార్గం Polytechnic

భవిష్యత్తులో ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి టెన్త్‌ తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి మార్గం పాలిటెక్నిక్‌. మూడు, మూడున్నరేళ్ల వ్యవధి ఉండే ఈ పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసినవాళ్లు పరిశ్రమల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఈసెట్‌లో ర్యాంకుతో నేరుగా బీటెక్‌ సెకండియర్‌లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్స్‌ ఏర్పాటు చేశారు. వీటిలో డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా వంటి కోర్సులు అందిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

పరిశ్రమల్లో ఉపాధికి ITIs

పదో తరగతి అర్హతతో వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడంతోపాటు స్వయంఉపాధికి మార్గం వేస్తాయి ఈ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ITIs). నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ తదితర ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు ఉత్తీర్ణత తర్వాత పారిశ్రామిక సంస్థల్లో టెక్నీషియన్స్‌గా ఉపాధి పొందొచ్చు. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ అందించే సర్టిఫికెట్‌ పొందితే ఉద్యోగ సాధనలో ప్రాధాన్యం లభిస్తుంది.

ఒకేషనల్‌ కోర్సులు

ఇంటర్మీడియట్‌ తర్వాత సత్వరం ఉపాధి పొందాలనుకునే వారికి మరో చక్కటి అవకాశం ఒకేషనల్‌ కోర్సులు. ఆఫీస్‌ అడ్మిస్ట్రేషన్‌ షిప్‌ నుంచి ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్‌ వరకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో పలు ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్‌ బోర్డులు.. అగ్రికల్చర్, బిజినెస్‌ అండ్‌ కామర్స్, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోంసైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్‌ విభాగాల్లో ఒకేషనల్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

 

Exit mobile version