Library Village | దేశంలో ఓ ఊరికి ఊరే లైబ్రరీ.. ఆ లైబ్రరీ విలేజ్‌ ఎక్కడుందో తెలుసా..?

  • Publish Date - April 10, 2024 / 09:02 AM IST

Library Village : పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు దేశంలోని ఒక గ్రామనికి గ్రామమే నెలవుగా ఉంది. అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్‌ అనే పేరు వచ్చింది. మరి ఆ లైబ్రరీ విలేజ్‌ ఎక్కడుంది..? ఆ లైబ్రరీ విలేజ్‌లో ఎన్ని పుస్తకాలున్నాయ్‌..? ఏయే రకం పుస్తకాలున్నాయ్‌..? ఆ లైబ్రరీ గ్రామం నిర్వహణలో ఎవరి చేతిలో ఉంది..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్వత లోయల నడుమ మణిగుహ్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ఓ పుస్తక ప్రపంచం. ఆ పుస్తక ప్రపంచంలో 17,500కు పైగా పుస్తకాలు ఉన్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని అగస్త్యముని బ్లాక్‌లో ఆ గ్రామం ఉంది. వేల పుస్తకాలకు నెలవుగా ఉండటంతో ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్‌గా పేరు వచ్చింది. ఆ గ్రామం లైబ్రరీ గ్రామంగా మారడానికి ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ పాత్ర ఎంతో ఉంది.

ఉత్తరాఖండ్‌లో 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. 2023 జనవరి 26న ‘హమారా గావ్ ఘర్ ఫౌండేషన్‌’ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడమని చెప్పారు. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ప్రతి రోజు విద్యార్థులు తమ తరగతులు ముగిసిన తర్వాత ఆ లైబ్రరీకి వెళ్లి చదువుకుంటారు.

గ్రామంలో లైబ్రరీని ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు ‘గావ్ ఘర్ మహోత్సవ్’ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్‌లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

Latest News