Site icon vidhaatha

TSPSC | ‘షూ’తో వ‌స్తే నో ఎంట్రీ.. గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిబంధ‌న‌లు ఇవే..!

TSPSC | ఈ నెల 11వ తేదీన నిర్వ‌హించ‌బోయే గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు టీఎస్‌పీఎస్సీ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసింది. గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తి అభ్య‌ర్థిని క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌ర్వాతే ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది.

వాచ్‌, షూ, వాలెట్‌కు అనుమ‌తి లేదు..

అయితే ఈ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు టీఎస్‌పీఎస్సీ ప్ర‌త్యేక నిబంధ‌న తీసుకొచ్చింది. అభ్య‌ర్థులు షూ వేసుకుని వ‌స్తే ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌బోమ‌ని హాల్‌టికెట్‌లో 5వ నిబంధ‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొంది. కేవ‌లం చెప్పులు మాత్ర‌మే ధ‌రించి రావాల‌ని సూచించింది. ఇక క్యాలికులేట‌ర్స్, సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ ప‌రిక‌రాలు, వాచ్‌, వాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్, రికార్డింగ్ చేసే ప‌రిక‌రాల‌ను అనుమ‌తించ‌బోమ‌ని టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది.

హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రి

హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓట‌ర్ ఐడీ, పాస్‌పోర్టు, గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రిగా తీసుకెళ్లాలి. వీటిలో ఏదో ఒక‌టి చూపించిన త‌ర్వాతే ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తించ‌నున్నారు.

15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్

ఇక ఎగ్జామ్ ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే ప‌రీక్షా కేంద్రాల గేట్ల‌ను మూసివేయ‌నున్నారు. ఉద‌యం 10:15 వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఎగ్జామ్ సెంట‌ర్ల‌లోకి అనుమ‌తించ‌నున్నారు. ఉద‌యం 8:30 గంట‌ల‌కే ప‌రీక్షా కేంద్రాలు తెరిచి ఉంటాయ‌ని హాల్‌టికెట్ల‌లో పేర్కొన్నారు.

503 గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీకి 2022, ఏప్రిల్ 26 నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్ష‌ను గ‌తేడాది అక్టోబ‌ర్ 16వ తేదీ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించిన ప‌లు రాత‌ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాలు లీకైన నేప‌థ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా ర‌ద్దు చేశారు. దీంతో గ్రూప్-1కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న 3,80,202 మంది అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లీ రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.

Exit mobile version