స్థానిక చరిత్రల వేటగాడు.. మెకంజీ

స్థానిక చరిత్రల వేటగాడు.. మెకంజీ(నేడు మెకంజీ ద్విశతాబ్ది వర్ధంతి)తెలుగునేలపై స్థానిక చరిత్రల పూలను పూయించి, పిఠాపురం అడవికోనలోని చిన్నిపువ్వు తేనె మాధుర్యాన్నీ, నాగలదిన్నె సీమలో నాగేటి చాలుల్లో పైర్లను మొలకెత్తించే విధానాన్నీ, కాకతీయుల రాజకీయ ప్రాభవాన్నీ, రెడ్డిరాజుల వైభవాన్నీ, విజయనగర శాసన విశేషాల్నీ, గండికోట గరిమనూ, సిద్ధవటం చిత్రాలనూ కైఫీయత్తుల రూపంలో విపులంగా అందించిన మహనీయుడు, కల్నల్‌ కాలిన్‌ మెకంజీ. అమరావతి శిల్పాల గురించి 1797లో Account of extract of journals లో మెకంజీ రాశాడు. […]

  • Publish Date - May 8, 2021 / 06:00 AM IST

స్థానిక చరిత్రల వేటగాడు.. మెకంజీ
(నేడు మెకంజీ ద్విశతాబ్ది వర్ధంతి)
తెలుగునేలపై స్థానిక చరిత్రల పూలను పూయించి, పిఠాపురం అడవికోనలోని చిన్నిపువ్వు తేనె మాధుర్యాన్నీ, నాగలదిన్నె సీమలో నాగేటి చాలుల్లో పైర్లను మొలకెత్తించే విధానాన్నీ, కాకతీయుల రాజకీయ ప్రాభవాన్నీ, రెడ్డిరాజుల వైభవాన్నీ, విజయనగర శాసన విశేషాల్నీ, గండికోట గరిమనూ, సిద్ధవటం చిత్రాలనూ కైఫీయత్తుల రూపంలో విపులంగా అందించిన మహనీయుడు, కల్నల్‌ కాలిన్‌ మెకంజీ.

మెకంజీ స్కాట్లండుకు సమీపలోని ‘లూయీ’ అనే ద్వీపంలోని ‘స్టార్నవే’  గ్రామంలో క్రీ.శ. 1754లో జన్మించాడు. మర్జొక్‌,బార్బరా మెకంజి తల్లిదండ్రులు . తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ తన గ్రామంలో పోస్టుమాస్టరుగా వుండేవాడు. స్టార్నొవే లోని బడిలో చదువు సాగించాడు కాలిన్‌ మెకంజీ. చిన్నతనం నుండే మెకంజీ గణితంపట్ల ఆసక్తి చూపేవాడు. కొంతకాలం స్టార్నొవే లో రెవెన్యూ శాఖలో పన్నుల వసూలు గుమాస్తాగా పనిచేశాడు మెకంజీ. ఫ్రాన్సిస్ జాన్‌ నేపియర్‌ జూనియర్  అనే ధనవంతుడు మెకంజీని తనకు సహాయకుడుగా నియమించుకున్నాడు. ఫ్రాన్సిస్  నేపియర్‌ పూర్వికులలో గొప్పవాడైన జాన్‌ నేపియర్‌ గణిత 'సంవర్గ్షమానములను(లాగరిథమ్స్‌) కనిపెట్టాడు. నేపియర్  చరిత్ర రాసేందుకు అవసరమైన ఆధారాలన్నీసేకరించాడు, జూనియర్  నేపియర్‌.  విషయ సేకరణలో అతనికి మెకంజీ ఎంతో సహాయ పడినాడు. 

నేపియర్ చరిత్ర విషయాల సేకరణలో భాగంగా  భారతీయ గణిత శాస్త్ర  విషయాల పరిచయం ఏర్పడింది. జూనియర్ నేపియర్‌ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు  మేకంజీకి ఈస్టిండియా కంపెనీ ఇంజనేరుగా ఉద్యోగం వచ్చింది. మెకంజీ 1782లో ఉద్యోగ విధుల్లో భాగంగా చెన్నైకి  వచ్చాడు. మధురలో కంపెనీ ఉద్యోగిగా ఉన్న  నేపియర్‌ అల్లుడు శామ్యూల్‌ జాన్‌స్టన్‌ కోరికమేరకు మెకంజీ  మధురలో కొంతకాలం నివసించాడు. భారతీయ గణితశాస్త్ర విషయాలపై అవగాహనకోసం అక్కడి పండితులతో సంప్రదింపులు జరపడం ప్రారంభించాడు. ఈ నేపధ్యలోనే  భారతదేశ చరిత్రపై, స్థానిక చరిత్రలపై ఆసక్తి కలిగింది. ఇంజనీరింగ్‌ ఉద్యోగిగా కోయంబత్తూరు, దిండిగల్లు మున్నగు చోట్ల పనిచేశాడు. ఆలాగే 1784-90 సం.ల మధ్య కోస్తా - రాయలసీమ ప్రాంతాలలో పనిచేశాడు. నెల్లూరు నుండి రాయలసీమ ప్రాంతానికి తూర్పు కనుమల ద్వారా రహదారి మార్గాలతో మ్యాపులను తయారుచేశాడు.
రాయలసీమ నెల్లూరుప్రాంతాలకు సంబంధించిన దేశపటాన్నీ,  నైసర్గిక పటాన్నీ మొట్ట మొదట తయారు చేసింది మెకంజీనే. మెకంజీ ప్రతిభను గుర్తించిన కంపెనీ 1790లో మెకంజీని గుంటూరు సీమ సర్వే అధికారిగా నియమించారు.  లార్డ్ కారన్‌ వాలిస్‌, మెకంజీని దత్త మండలాల (నేటి రాయలసీమ)తోపాటు నెల్లూరు సీమ సర్వే చేయుటకు నియమించాడు. 

అధిక సంఖ్యలో వ్రాత ప్రతులను,తాళపత్రాలను, నాణేలను, ప్రాచీన వస్తువులను సేకరించాడు. చెన్నైలోని ప్రాచ్య లిఖిత గ్రంథ భాండారం,  లండన్లోని ఇండియా ఆఫీసు లైబ్రరీ,  కలకత్తా,  న్యూఢిల్లీ పురావస్తు సంగ్రహాలయాలలో అవన్నీ ఇప్పుడు  భద్రపరచబడి ఉన్నాయి. మెకంజీ  'సేకరింపబడిన విషయాలన్నీ ఐదు సంపుటాలుగా భద్రపరిచారు. మెకంజీ సేకరణలో హిస్టారికల్‌ రికార్డ్‌ ఆఫ్‌ దీ సర్వే ఆఫ్‌ ఇండియా రికార్డులు కూడా ఉన్నాయి.  ఈ సర్వే రికార్డులన్నీడెహ్రడూన్‌లో భద్రపరచబడి ఆ తర్వాత  న్యూఢిల్లీలోని నేషనల్‌ ఆర్కైవ్స్‌ కు తరలింపబడినాయి.

అమరావతి శిల్పాల గురించి 1797లో Account of extract of journals లో మెకంజీ రాశాడు. మెకంజీ గీసిన అమరావతి శిల్పాల చిత్రాలు లండన్‌ లోని ఇండియా ఆఫీసు గ్రంథాలయంలోవున్నాయి. శ్రీశైలం ఆలయంలో ప్రవేశించిన మొదటి ఆంగ్రేయుడు మెకంజీ. కంభం చెరువుగురించి , పెన్నానది మూలాన్ని గురించి ఆంగ్ల పత్రికల్లో రాశాడు. సర్వే పనులలో భాగంగా దేశమంతా సంచారం చేశాడు.

సుందరమైన దేవాలయాలను పరిశీలించాడు. శాసనాలపట్ల మరింత ఆసక్తిని పెంచుకొన్నాడు.1810-1815 వరకు మెకంజీ మదరాసు ప్రాంత సర్వేయర్‌ జనరల్‌గా నియమింప బడినాడు. 1816 నుండి 1821 వరకు భారతదేశపు మొదటి సర్వేయర్‌ జనరల్‌గా నియమింపబడినాడు.

దక్షిణ భారత దేశంలో 1793 నుండి 1816 వరకు ఉద్యోగం చేస్తున్న కాలంలో మెకంజీ తాళపత్ర గ్రంథాలను, వ్రాతప్రతులను 1560 వరకు సేకరించాడు. అంతేకాకుండా 2070 స్థానిక చరిత్రలను 8076 శాసన పాఠాలను 79 దేశ పటాలను 2630 చిత్రలేఖన బొమ్మలను, 6218 నాణములను, 106 శిల్ప చిత్రాలను, 40 పురాతన వస్తువులను సేకరించాడు.

రాయలసీమ ప్రాంత స్థానిక చరిత్రలను, శాసనాలను ‘సీడెడ్ డిస్ట్రిక్స్ ‘ పేరుతో ప్రత్యేక సంపుటాలుగా పొందుపరచడం విశేషం. మెకంజీ తెలుగుతోపాటు ,కన్నడ, తమిళం , మలయాళం, మరాఠీ, హిందీ భాషలలో కూడా రాతప్రతులను రాయించాడు. ఇందుకోసం గ్రామా కరణాలను నియోగించాడు.

  మెకంజీ తన సొంత డబ్బులో  15 వేల రూపాయలు ఖర్చుచేసి ఈ తాళపత్రాలను ,శాసనాలను, నాణెములను మొదలైనవాటిని సేకరించడం విశేషం. ఇంత పెద్ద సంఖ్యలో సమాచాన్ని సేకరించడంలో ఏలూరుకు చెందిన వెంకట బొర్రయ్య, ఎంతగానో సహకరించాడు. బొర్రయ్య సహాయంతో మెకంజీ  తెలుగు, కన్నడ శాసనాలలోని విషయాలను తెలుసుకొన్నాడు. బొర్రయ్యకు వేతనమిచ్చి గ్రామ చరిత్రలను రాసేందుకు, తాళపత్ర గ్రంథాలను సేకరించేందుకు, నాణెములను సేకరించేందుకు  వినియోగించుకున్నాడు.
 మెకంజీ కూడా బొర్రయ్యను ఎంతగానో ఆదరించాడు. దురదృష్ట వశాత్తూ బొర్రయ్య 27 ఏళ్ళ ప్రాయంలోనే చనిపోవడంతో,  బొర్రయ్య తమ్ముడు లక్ష్మయ్య మెకంజీకి సహాయకుడయ్యాడు.  తన ఆస్తిలో ఇదు శాతం భాగం లక్షుమయ్యకు కేటాయిస్తూ మెకంజీ వీలునామా రాయడం విశేషం . అమరావతిలో బౌద్ద స్తూపాన్ని మెకంజీ గుర్తించారు. 

1792లో అమరావతిని దర్శించిన మెకంజీ అక్కడి సంస్తానీకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుని కలుసుకొని అమరావతి శిధిలాలను పరిరక్షించాడు.  అమరావతి స్తూపం వర్ణనను ఏషియాటిక్‌ సొసైటీవారి సంపుటాలలో ప్రచురించాడు. హంపీ శిధిలాలనూ శోధించాడు. సంస్కృతం, అరబ్బీ, బర్మీస్‌ , పారసీ, జాపనీస్‌,  భాషలలోని గ్రంథాలను, శిల్పాలను, నాణేలను  వారన్‌ హేస్టింగ్స్‌ ఇంగ్లాండుకు పంపాడు. 

దక్షిణ భారతదేశ భాషలలోని స్థానిక చరిత్రలు, తాళ పత్రాలు  మున్నగునవి 5,31,255. ఇవన్నీ మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో భద్రపరచబడినాయి. దాదాపు 38ఏళ్ళపాటు మన చరిత్రకు కావలసిన సమాచార సామగ్రిని సేకరించాడు. ప్రపంచ చరిత్రలో అన్ని చారిత్రక విషయాలను సేకరించినవారు మెకంజీ తప్ప మరొకరు లేరు.

మెకంజీ రాతప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి అందలి చారిత్రక విషయాలను సేకరించి అనువదించిన వారిలో ప్రముఖుడు సి.పి.బ్రౌన్‌. "వార్స్‌ ఆఫ్‌ రాజాస్‌’, ‘మెమోరీస్‌ ఆఫ్‌ హైదరాలి, టిప్పుసుల్తాన్‌ సైక్లిక్‌టేబిల్స్‌, కర్నాటిక్‌ క్రోనాలజి,’ ఆనెగొందిరాజుల చరిత్ర, విజయనగర రాజుల చరిత్ర, మరాఠా బ్రాహ్మణులు పుస్తకాలను సి.పి. బ్రౌన్‌ అనువదించడంతోపాటు శిథిలమవుతున్న మెకంజి రాతప్రతులను, ఎత్తిరాయించి సొంత ఖర్చుతో సంపుటాలుగా రూపొందించాడు.

అవన్నీ ఇప్పుడు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండాగారంలో వున్నాయి. జూన్‌ 1884 నాటి  'సాటర్‌డే మేగజైన్‌’ లోని మెకంజీ బొమ్మను సిపి బ్రౌన్ అందంగా రాయించి మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథ భాండాగారంలోవుంచాడు. మెకంజీ సేకరణలను అతని మరణానంతరం వారన్‌ హేస్టింగ్స్‌ ఈస్ట్ ఇండియాకంపెనీ తరపున 10 వేల డాలర్లకు కొనుగోలు చేశాడు.

చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు, కెవి లక్ష్మణరావు, భావరాజు కృష్ణారావు, వడ్డాది అప్పారావు , మల్లంపల్లి సోమశేఖరశర్మ, రాళ్ళబండి సుబ్బారావు , నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు లాంటి ప్రసిద్దులైన తెలుగు చరిత్రకారులకు తమ చరిత్ర పుస్తకాల రచనలో మెకంజీ కైఫీయత్తులు, శాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

నేటికీ విశ్వవిద్యాలయాల్లో చరిత్ర పరిశోధక విద్యార్థులు మెకంజీ ప్రతులను తిరగేయకుండా తమ పరిశోధనను పూర్తి చేయడం కష్టమంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. మెకంజీ కైఫీయత్తులను కడపలోని సిపి బ్రౌన్ భాషాపరిశోధనసంస్థ ఇప్పటిదాకా 7 సంపుటాలుగా ప్రచురించింది.

1821 సంవత్సరం మేనెల 8 వతేదీన తన 67 ఏళ్ల వయసులో కలకత్తాలో కన్నుమూసిన కల్నల్ కాలిన్ మెకంజీ సేవలు చిరస్మరణీయం.

  • తవ్వా ఓబుల్ రెడ్డి

Latest News