అమెరికా డల్లాస్ లో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ ఎల్ బీ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే యువకుడు మరణించారు. మృతుడి వయస్సు 27 ఏళ్లు. బీడీఎస్ పూర్తి చేసిన చంద్రశేఖర్ ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లారు. చంద్రశేఖర్ చదువుతూ పార్ట్ టైమ్ ఉద్యోగిగా గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. చంద్రశేఖర్ పనిచేస్తున్న గ్యాస్ స్టేషన్ కు వచ్చిన ఓ దుండగుడు చంద్రశేఖర్ పై కాల్పులకు దిగారు. అయితే ఆ వ్యక్తి చంద్రశేఖర్ పై ఎందుకు కాల్పులు జరిపాడనే విషయమై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మరణించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అమెరికా పోలీసులు సమాచారం పంపారు. చంద్రశేఖర్ కుటుంబం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ మరణించిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్ పార్థీవ దేహాన్ని త్వరగా హైదరాబాద్ కు రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.