Construction of State-of-the-Art New Osmania General Hospital Begins in Hyderabad
హైదరాబాద్:
New OGH construction | హైదరాబాద్ వైద్యరంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రూపురేఖల మారనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) నిర్మాణ సారథ్యంలో కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దసరా రోజున గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంగణంలో ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ కే. గోవర్ధన్ రెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఇప్పుడున్న ఆసుపత్రి శతాబ్ధం కిందటికి కావడంలో శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని పునర్నించాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించగా కోర్టు కేసుల వల్ల కాలయాపన జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి కట్టాలని నిర్ణయించబడింది.
ఉస్మానియా హాస్పిటల్ కొత్త అవతారం – 30 నెలల్లో ఆధునిక రూపం
ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ₹1,667 కోట్లు, పూర్తికావడానికి గడువు 30 నెలలుగా నిర్ణయించారు. ఇందులో ప్రధాన హాస్పిటల్ బ్లాక్ నిర్మాణానికి ₹979 కోట్లు, మగ, మహిళా హాస్టల్స్‌కు ₹103 కోట్లు, అకడమిక్ బ్లాక్‌కు ₹72 కోట్లు, యుటిలిటీ స్ట్రక్చర్స్‌కు ₹54 కోట్లు, ధర్మశాలకు ₹17 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రోడ్లు, పథ్‌వేలు, డ్రైనేజీకి ₹10 కోట్లు, నాళాల కవర్‌కు ₹8 కోట్లు, మార్ట్యూరీ నిర్మాణానికి ₹5.99 కోట్లు, కంపౌండ్ వాల్‌కు ₹4.06 కోట్లు, సెక్యూరిటీ రూంలకు ₹90 లక్షలు కేటాయించారు. నీటి సరఫరా, శానిటేషన్ పనులకు ₹24 కోట్లు కేటాయించగా, ఎలక్ట్రో-మెకానికల్ వర్క్స్ (పవర్, లిఫ్ట్స్, HVAC మొదలైనవి)కు ₹384 కోట్లు కేటాయించారు.
ప్రధాన హాస్పిటల్ భవన నిర్మాణం 12 అంతస్తులుగా (రెండు బేస్‌మెంట్ స్థాయిలతో సహా) రూపొందనుంది. ఇది మొత్తం 23.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. పురుషుల హాస్టల్‌కి గ్రౌండ్ ప్లస్ 10 ఫ్లోర్స్, మహిళా హాస్టల్‌కి గ్రౌండ్ ప్లస్ 12 ఫ్లోర్స్, ధర్మశాలకు బేస్‌మెంట్ + గ్రౌండ్ + 9 ఫ్లోర్స్, మార్ట్యూరీకి బేస్‌మెంట్ + గ్రౌండ్ ఫ్లోర్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలకు బేస్‌మెంట్ + గ్రౌండ్ + 8 ఫ్లోర్స్ నిర్మిస్తారు.
ఈ ప్రాజెక్ట్ నాలుగు మైలురాళ్లుగా దశల వారీగా సాగనుంది – 9 నెలలు, 18 నెలలు, 24 నెలలు, 30 నెలలలో పూర్తి చేయాల్సిన లక్ష్యాలను కాంట్రాక్టర్‌కు విధించారు. ఈ సంవత్సరం జనవరి 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ 30 నెలల్లో పూర్తవనుంది. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది. కొత్త హాస్పిటల్ 2000 పడకల సామర్థ్యం ఉండనుండగా, 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్స్, రోబోటిక్ సర్జరీ యూనిట్లు, అవయవ మార్పిడి బ్లాకులు ఏర్పాటు కానున్నాయి.
అదే విధంగా అకడమిక్ బ్లాక్, పురుష/మహిళా హాస్టల్‌లు, ధర్మశాల, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్స్, సెక్యూరిటీ విభాగం కూడా నిర్మిస్తారు. రెండు స్థాయిల బేస్‌మెంట్‌లో 1500 కార్ల పార్కింగ్ సదుపాయం, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపుకు హెలిప్యాడ్ కూడా నిర్మించబోతున్నారు. వైద్యరంగంలోని అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో కొత్త హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు కూడా నిర్మిస్తారు. రూఫ్‌టాప్ గార్డెన్స్, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీతో సరికొత్త వాతావరణాన్ని సృష్టించనున్నారు. స్వచ్ఛమైన గాలి, పేషెంట్ల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా డిజైన్ చేశారు.
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఎప్పుడు ఎవరు నిర్మించారు?
హైదరాబాద్ నగరానికి ఆరోగ్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన వైద్యసంస్థల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH). ముందంజలో నిలిచింది. 1919లో 7వ నిజాం, మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ హాస్పిటల్ అప్పటినుంచి ఇప్పటివరకు కోట్లాదిమంది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఇండో-సరాసెనిక్ శైలిలో నిర్మించిన అద్భుత ఆర్కిటెక్చర్, శతాబ్దం పైగా నిలిచిన సేవలు దీనికి ప్రత్యేకతను తెచ్చాయి.
ఈ ఆసుపత్రిని బ్రిటీష్ ఆర్కిటెక్ట్ Vincent Jerome Esch డిజైన్ చేశారు. అఫ్జల్‌గంజ్ వద్ద మూసీ నది ఒడ్డున నిర్మించిన ఈ భవనం హైదరాబాద్ గర్వకారణమైంది. 1921లో పూర్తి స్థాయి సేవలు ప్రారంభించిన ఈ హాస్పిటల్, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యసంస్థగా ఎదిగింది.
వైద్యరంగానికి అనేకమంది నిపుణులను అందించిన ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా ఈ హాస్పిటల్‌కు అనుబంధంగా ఉంది. సాధారణ వైద్యసేవల నుంచి ప్రత్యేక చికిత్సల వరకు ప్రజలకు అందిస్తూ, పేదల ప్రాణాల పాలిట పెన్నిధిలో మారింది.
అయితే, కాలక్రమేణా పాత భవనం పాడైపోవడం, మెయింటెనెన్స్ సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 2001 భూకంపం తర్వాత భవనం సేఫ్టీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాత భవనాన్ని కూల్చాలా? కాపాడాలా? అనే వివాదం ఏళ్లుగా కొనసాగింది. ఎట్టకేలకు పాత భవనం కూల్చకుండా, కొత్తది గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తున్నారు.