Explained: Diethylene Glycol Contamination in ‘Coldrif’ Syrup — The Deadly Chemical Behind childrens’ death
న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (విధాత):
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ కాఫ్ సిరప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ యూనిట్‌లో తయారైన ఈ సిరప్ నమూనాల్లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే ప్రమాదకర రసాయనం పరిమితిని మించి ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో సేకరించిన నమూనాలు క్లీన్‌గా ఉన్నప్పటికీ, తయారీ కేంద్రం నుంచే సేకరించిన నమూనాల్లో DEG కలుషితమైనట్లు తేలింది. దీంతో మధ్యప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు వెంటనే ఆ సిరప్ విక్రయాలను నిషేధించాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, CDSCO, NIV, ICMR, NEERI, AIIMS నాగ్‌పూర్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం ఇప్పుడు ఈ దగ్గుమందు గురించి పరిశోధిస్తోంది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా ఉన్న 19 ఔషధ తయారీ యూనిట్లపై తనిఖీలు ప్రారంభమయ్యాయి.
డైఈథిలీన్ గ్లైకాల్ –కనపడని మృత్యువు
డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) మరియు ఎథిలీన్ గ్లైకాల్ (EG) అనే రసాయనాలు సాధారణంగా పారిశ్రామిక ద్రావకాలు — యాంటీ ఫ్రీజ్, పెయింట్స్, బ్రేక్ ఫ్లూయిడ్స్, ప్లాస్టిక్‌ల తయారీలో వాడతారు. ఇవి ఔషధ తయారీలో వాడకూడదు. అయితే కొన్నిసార్లు గ్లిసరిన్ వంటి ఫార్మా పదార్థాలను చవకైన పరిశ్రమ స్థాయి పదార్థాలతో భర్తీ చేయడం వల్ల ఈ విష రసాయనాలు మందుల్లో కలుస్తాయి. DEGకి రంగు ఉండదు, తియ్యగా ఉంటుంది, టానిక్‌లా కనబడుతుంది కాబట్టి గ్లిసరిన్ స్థానంలో వాడతారు. కొన్నికఠినమైన ల్యాబ్ పరీక్షలు చేయకపోతే అది నిజమైన గ్లిసరిన్ కాదని తెలుసుకోవడం చాలా కష్టం.
ALSO READ : మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు విషాదం : 14 మంది చిన్నారుల మృతి – ప్రభుత్వ వైద్యుడు అరెస్టు
DEG లేదా EG మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి విరిగిపోయి విష పదార్థాలుగా మారి మూత్రపిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మొదట జ్వరం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనబడతాయి. అతి తక్కువ సమయంలో మూత్రపిండాల వైఫల్యం, ఫిట్స్, మరణం సంభవిస్తాయి. పిల్లల విషయంలో పరిస్థితి మరింత భయానకం. కొద్ది పరిమాణం DEG కూడా వారికి ప్రాణాంతకంగా మారుతుంది. గాంబియాలో 2022లో DEG కలుషిత సిరప్ వల్ల కనీసం 70 మంది చిన్నారులు మృతి చెందారు. అదే రసాయనం ఇప్పుడు భారత్‌లో కూడా వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, కేంద్ర చర్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే పలు దేశాల్లో DEG, EG కలుషిత సిరప్‌ల కారణంగా 300 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. WHO దగ్గుమందుల నాణ్యతా నియంత్రణ కోసం రెండు దశల ల్యాబ్ టెస్టింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది:
1️⃣ Thin Layer Chromatography (TLC) – ప్రారంభ స్క్రీనింగ్
2️⃣ Gas Chromatography (GC) – తుది నిర్ధారణ
తక్కువ నాణ్యత గల ముడిపదార్థాలను అనుమతించకండి. ఔషధ సరఫరా గొలుసును కఠినంగా పర్యవేక్షించండంటూ WHO అన్ని దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇదే దిశగా చర్యలు ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు తయారీ యూనిట్లను తిరిగి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మందుల తయారీలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.
డైఈథిలీన్ గ్లైకాల్ కథనం, భారత ఔషధ పరిశ్రమలో ఉన్న అతి ముఖ్యమైన సమస్యను బట్టబయలు చేసింది. ల్యాబ్ టెస్టింగ్ లోపాలు, సరఫరా గొలుసు నిర్లక్ష్యం, మరియు తక్కువ ఖర్చు కోసం నాణ్యతతో రాజీ — ఇవే ఈ విషాదాల వెనుక ఉన్న అసలు కారకాలు.