దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకుకడుతున్నాయి.
దేశంలో తొలిసారిగా మరణాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో 3 వేలు దాటింది. తాజాగా 3,293 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దాంతో మరణాల సంఖ్య రెండు లక్షల మార్కు(2,01,187)ను దాటింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..అమెరికా(5.87లక్షలు), బ్రెజిల్(3.95లక్షలు), మెక్సికో(2.15లక్షలు) మరణాల సంఖ్య పరంగా భారత్ కంటే ముందు వరసలో ఉన్నాయి. అలాగే నిన్న 17,23,912 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,60,960 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది.
ఇక కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 29,78,709కి చేరింది. మొత్తం కేసుల్లో క్రియాశీల వాటా 16.34 శాతంగా ఉంది. ఇక నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2.61లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక్కటే సానుకూలాంశం. ఇప్పటివరకు కోటీ 48లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 82.54 శాతానికి దిగజారింది.