Site icon vidhaatha

Antarctic ice sheets | అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఎలా ఉన్నదో తెలుసా? రాన్‌ వెలుగులోకి తెచ్చిన అద్భుతాలు

న్యూయార్క్‌ : అంటార్కిటికా పై నుంచి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ.. సముద్రంపై తేలియాడే ఆ మంచు బండల కొండల కింద (world existing beneath the Antarctic ice sheets) ఎలా ఉన్నదో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘రాన్‌’ అనే రోబో అంటార్కిటికా మంచుఫలకాల కింద భాగంలో ఉన్న అద్భుత దృశ్యాలను ఆవిష్కరించింది. అంటార్కిటిక్‌ మంచు ఫలకాల కింద చదునుగా లేదని, పర్వతశిఖరాలు కిందికి పొడుచుకువచ్చినట్టు, ఎడారిలో ఉండే తరహాలో లోయలు, పీఠభూములు (plateaus), కొండల వంటివి ఉన్నాయని ఆ దృశ్యాలను గమనిస్తే అర్థమవుతున్నది. కాకపోతే అవన్నీ రివర్స్‌లో ఉన్నాయి.

ఇప్పటి వరకూ ప్రపంచం చూడని ఈ అద్భుత దృశ్యాలను, వాతావరణ మార్పుల కారణంగా కరిగిపోతున్న భారీ మంచు ఫలకాలను ‘రాన్‌ (Ran) అనే మానవ రహిత జలాంతర్గామి రోబో చూపించింది. దాదాపు వెయ్యి కిలోమీటర్ల వైశాల్యం ఉన్న డాట్సన్‌ ఐస్‌ షెల్ఫ్‌ (Dotson Ice Shelf) కింద 27 రోజులపాటు ‘రాన్‌’ ప్రయాణించింది.

పశ్చిమ అంటార్కిటికాలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశం డాట్సన్‌ ఐస్‌ షెల్ఫ్‌. అవి చదునుగా ఉండవు. నానాటికీ పెరుగుతూ ఉంటాయి. అవి భూమి ఆధారిత దళసరి హిమానీనదాలతో కూడి ఉంటాయి. అవి పైకి తేలుతూ ఉంటాయి కానీ.. వాటి కింద భారీ గుహల్లాంటివి ఉంటాయి. ఈ భారీ మంచుకొండలు కరిగే సరళిపై రాన్‌ అధ్యయనం చేసింది. పశ్చిమ అంటార్కిటిక్‌ మంచు ఫలకాలు స్థిరత్వానికి డాట్సన్‌ ఐస్‌ షెల్ఫ్‌ అత్యంత కీలకమైనది. దీని పరిమాణం, అది ఉన్న ప్రదేశం రీత్యా భవిష్యత్తులో సముద్ర జలాల మట్టం పెరిగే అంశం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇది కరగడం అంటే.. సముద్ర జల మట్టాలు పెరగడమని అర్థం. వాటి అడుగు భాగాన ఉన్న కొండలు, పీఠభూములు భూ భ్రమణం వల్ల ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. రాన్‌ తాజా ఆవిష్కరణల నేపథ్యంలో మరింత లోతుగా పరిశోధనలు జరిపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

 

Exit mobile version