మ‌య‌న్మార్ సైన్యం కాల్పుల్లో 29 మంది దుర్మ‌ర‌ణం.. వారిలో ప‌లువురు చిన్నారులు

  • Publish Date - October 10, 2023 / 08:54 AM IST

ఉక్రెయిన్ – ర‌ష్యా, పాల‌స్తీనా – ఇజ్రాయెల్ ఇలా.. ప్ర‌పంచంలో ఏదో చోట రోజూ ర‌క్త‌మోడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధం జ‌రుగుతుండ‌గానే.. భార‌త స‌రిహ‌ద్దు దేశ‌మైన మ‌య‌న్మార్ (Myanmar) లో సైన్యం కొన్ని స‌మూహాల‌పై దాడుల‌కు పాల్ప‌డింది. ఉత్త‌ర మ‌య‌న్మార్‌లోని ఆ దేశ సైన్యం జ‌రిపిన దాడిలో 29 మంది మ‌ర‌ణించ‌గా డ‌జ‌న్ల మంది గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. తిరుగుబాటు దారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక క్యాంపులే ల‌క్ష్యంగా సైన్యం విరుచుకుప‌డింద‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది.


మ‌హిళ‌లు, చిన్న‌పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా మ‌ట్టుపెట్టార‌ని వేర్పాటువాద నాయ‌కుడు ఒక‌రు చెప్పిన‌ట్లు వెల్ల‌డించింది. అర్ధ‌రాత్రి 11:30 ప్రాంతంలో ఈ దాడి చేసుకుంద‌ని, అందుకే ప్ర‌తిఘ‌ట‌న సాధ్య‌ప‌డ‌లేద‌ని క‌చిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ ప్ర‌క‌టించింది. దీనికి మ‌య‌న్మార్ సైన్యానికి ద‌శ‌బ్దాలుగా ఘ‌ర్ష‌ణ కొన‌సాగుతూ వ‌స్తోంది. 2021లో దేశ పాల‌న‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న మ‌య‌న్మార్ సైన్యం.. ఇలాంటి వేర్పాటువాద ద‌ళాల‌పై ఉక్కుపాదం మోపుతోంది. అయితే దీనిని యుద్ధ నేరంగా విదేశాల్లో ఉన్న మ‌య‌న్మార్ మాన‌వతావాదులు అభివ‌ర్ణించారు. అంత‌ర్జాతీయ స‌మాజం ఈ ఘ‌ట‌న‌ను ఖండించాల‌ని, త‌మ‌దేశ సైన్యంపై ఆంక్ష‌లు విధించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Latest News