Site icon vidhaatha

కొవిడ్ త‌ర‌హా వ్యాధుల వ‌ల్ల 2050 క‌ల్లా 12 రెట్ల ఎక్కువ మ‌ర‌ణాలు..

జంతువుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించే కొవిడ్‌ (Covid) త‌ర‌హా వ్యాధుల వ‌ల్ల 2020లో న‌మోదైన మ‌ర‌ణాల కంటే 2050లో 12 రెట్లు ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌విస్తాయ‌ని ఒక నివేదిక హెచ్చ‌రించింది. అమెరికా బ‌యోటెక్ సంస్థ గింకో బ‌యోవ‌ర్క్స్ ఈ అధ్య‌య‌నాన్ని (Study) నిర్వ‌హించింది. ఈ ప‌రిశోధ‌న వివ‌రాలు బీఎంజే గ్లోబ‌ల్ హెల్త్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. అట‌వీ విస్తీర్ణం త‌గ్గ‌డం, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల జంతువుల నుంచి మ‌నుషుల‌కు వ్యాధుల వ్యాప్తి సుల‌భంగా జ‌రుగుతుంద‌ని.. మ‌ర‌ణాలూ అదే స్థాయిలో న‌మోద‌వుతాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.


1963 నుంచి 2019 వ‌ర‌కు ఉన్న స‌మాచారాన్ని విశ్లేషించ‌గా.. అంటువ్యాధుల (Epidemics) ముట్ట‌డిలో ఏటా 5 శాతం, మ‌ర‌ణాల్లో 9 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. ఇది ఇలానే కొన‌సాగితే 2050 నాటికి 2020 కంటే అంటువ్యాధుల వ్యాప్తి రేటు 4 రెట్లు, మ‌ర‌ణాల రేటు 12 రెట్లు న‌మోద‌య్యే ప్రమాద‌ముంది. అయితే ఈ అంచ‌నాలో క‌నిపిస్తున్న సంఖ్య చాలా త‌క్కువ‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. దానికి కార‌ణం కొవిడ్ వ‌ల్ల సంభ‌వించిన మ‌ర‌ణాల‌ను వీరు లెక్క లోకి తీసుకోక‌పోవ‌డ‌మే. అందువ‌ల్ల ఈ స‌మాచారం ఒక భావ‌నను ఇవ్వ‌గ‌ల‌దు త‌ప్ప‌.. మ‌ర‌ణాల సంఖ్య‌ను అంత నిర్ధార‌ణ‌గా చెప్ప‌లేద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ నివేదిక‌లో పేర్కొన్న దాని కంటే ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిలంగా ఉండే అవ‌కాశ‌మే ఎక్కువ‌ని వెల్ల‌డించారు.


ఎబోలా వైర‌స్‌, మార్‌బ‌ర్గ్ వైర‌స్‌, సార్స్ క‌రోనా వైర‌స్ 1, నిఫా వైర‌స్‌, మ‌చుపో వైర‌స్ వ‌ల్ల క‌లిగిన మ‌ర‌ణాల ఆధారంగా ఈ నివేదిక‌ను రూపొందించారు. వీటికి సంబంధించి 1963 నుంచి 2019 వ‌ర‌కు ప్ర‌బ‌లిన అంటువ్యాధుల‌ను అధ్య‌యనం చేశారు. ఈ కాలంలో ఏర్ప‌డిన 3000 సంక్షోభాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని విశ్లేషించారు. దీనిని బ‌ట్టి జంతువుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించే వ్యాధులు ఏదో గాలి నుంచి ఊడిప‌డిన‌ట్లు రావ‌డం లేద‌ని.. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం నిర్దేశిత విరామాల త‌ర్వాత వ‌స్తున్న‌ట్లు అనిపిస్తోంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా వైద్య వ్య‌వ‌స్థ‌ను, సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల్సి ఉంటుంద‌ని.. లేదంటే మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Exit mobile version