Site icon vidhaatha

Boat sink | కలరా భయంతో మరో చోటుకి పయనం.. పడవ మునిగి 91 మంది దుర్మరణం..!

boat-sink

Boat sink : ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌ తూర్పు తీరంలో ఆదివారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో పడవ మునిగి 91 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అత్యధికంగా పిల్లలే ఉన్నారు. మొజాంబిక్‌ సర్కారు ఈ విషయాన్ని ధృవీకరించింది. మొజాంబిక్‌లోని ప్రధాన భూభాగంలో కలరా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు చాలామంది ప్రధాన భూభాగం నుంచి దీవులకు వెళ్తున్నారు. ఆ విధంగా కొంతమంది దీవులకు వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో పడవలో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. చేపల పడవను రవాణాకు వినియోగించడమేగాక అందులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం కూడా ప్రమాదానికి కారణమైందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కొంతమంది గల్లంతయ్యారని, మరికొందరిని మత్స్యకారులు రక్షించి ఒడ్డుకు చేర్చారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

పడవ మునిగిన సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కలరా వ్యాప్తి పెరగడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్‌ సెక్రటరీ జైమ్‌ నెటో తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 15,000 కలరా కేసులు నమోదైనట్లు, 32 మంది చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Exit mobile version