Site icon vidhaatha

Chilean Angel Shark | 150 సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన సొరచేప..! శాస్త్రవేత్తలు ఫుల్‌ ఖుషీ..!

Chilean Angel Shark | చిలియన్‌ ఏంజిల్‌ అనే సొరచేప చిలీ మత్స్యకారులకు చిక్కింది. దాంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ అరుదైన సొర చేప మళ్లి గుర్తించడం విశేషం. 1887లో చివరిసారిగా ఈ సొరపై ఓ పరిశోధకుడు తీరప్రాంతంలో తక్కువ నీరు ఉన్న ప్రాంతంలో గుర్తించారు. అయితే, ఈ సొరను చూసి ఆయన రే చేపగా భావించారు. అయితే, ఈ సొర గురించి ఆయన ఇచ్చిన వివరణ అసంపూర్ణమని ఆ తర్వాతి పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి తోడుగా సొర కళేబరం సైతం కనబడకుండా పోవడంతో శాస్త్రవేత్తలకు దానిపై అధ్యయనం చేసే అవకాశం లేకపోయింది. దాంతో సముద్రజీవాల సమాచారం లోప భూయిష్టంగా మారడంతో.. ఈ జీవి వివరాలు మిస్టరీగా మారాయి. ఈ క్రమంలోనే అరుదైన చిలియన్‌ ఏంజిల్‌ సొర చేప మళ్లీ సముద్ర జలాల్లో దర్శనమివ్వడంతో పరిశోధకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు మూడు అడుగుల పొడవుండే ఈ సముద్ర జీవి.. సముద్రపు నీటి అడుగున మనుగుడ సాగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సముద్రం అడుగున 400 మీటర్ల లోతు వరకు ఉండేందుకు ఇష్టపడుతుందని పేర్కొన్నారు. దీన్ని స్క్వాటినా ఆర్మాటా అని సైతం పిలుస్తారని.. 150 సెంటీమీటర్ల వరకు పొడు ఉండే మధ్య తరహా షార్క్‌ అని పేర్కొన్నారు. ఇవి క్రస్టేసియన్లు, ఎలాస్మోబ్రాంచ్‌లు, మొలస్క్‌లు, బల్లి చేపలు, టెలియోస్ట్‌లు, వాటి అవశేషాలను తింటాయి. కొన్ని రకాల రొయ్యలను తినడానికి ఇష్టపడతాయని తెలిపారు. నిర్దిష్ట వాతావరణంలో ఉండే వాటిని మాత్రమే తింటాయని చెప్పారు. రే చేప ఆకారంలో ఉండడం దీని ప్రత్యేకగా తెలిపారు. చాలా అరుదుగా మాత్రమే కనిపించడంతో దీనిపై శాస్త్రవేత్తల వద్ద అంత సమాచారం లేదు. అయితే, ఈ సొర అంతరించిపోయే దశను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. తాజాగా దొరికిన సొరల అధ్యయనంతో వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చని వివరించారు.

Exit mobile version