Site icon vidhaatha

Peter Higgs | ‘దైవ కణం’ కనుగొన్న శాస్త్రవేత్త పీటర్‌ హిగ్స్‌ కన్నుమూత..

Peter Higgs | నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త పీటర్‌ హిగ్స్‌ (Peter Higgs) కన్నుమూశారు. బిగ్‌ బ్యాంగ్‌ అనంతరం విశ్వం ఎలా సృష్టించబడిందో వివరించడంలో సహాయపడి ‘దైవ కణం’ (God Particle)ను ఆయన కనుగొన్నారు. ఈ విషయాన్ని స్కాటిష్‌ యూనివర్సిటీ తెలిపింది. అనారోగ్యం కారణంగా సోమవారం ఇంట్లోనే ఆయన 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారని పేర్కొంది. ఆయన ‘దైవ కణం’లేదంటే ‘హిగ్స్‌ బోసన్‌’ (Higgs Boson) సిద్ధాంతంపై పరిశోధనలు చేసిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించారు. కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా చాటిచెప్పడంతో పాటు భౌతికశాస్త్రంలో ఎన్నో చిక్కుముడులను విప్పారు. 1964లోనే ‘హిగ్స్‌ బోసన్‌’ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా తెలిపారు.

హిగ్స్-బోసన్ సిద్ధాంతానికి భౌతిక శాస్త్రంలో సంయుక్తంగా 2013లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. హిగ్స్ స్కాటిష్ యూనివర్శిటీలో దాదాపు 50 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆయన ఓ గొప్ప ఉపాధ్యాయుడని స్కాటిష్‌ యూనివర్సిటీ పేర్కొంది. యువత శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొంది. వేలాది మంది శాస్త్రవేత్తలు ఆయన రచనల నుంచి ప్రేరణ పొందారని.. రాబోయే తరాలు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటాయని యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్‌ 2012లో యూరోపియన్‌ ఆర్గనేజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌లోని లార్జ్‌ హ్యాడ్రన్‌ కొల్లాయిడర్‌లో ‘దైవ కణం’పై ప్రయోగాలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా దాదాపు అరశతాబ్దానికి ముందే ఆయన రూపొందించిన సిద్ధాంతాన్ని, హిగ్స్‌ బోసన్‌ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Exit mobile version