Putin–Xi Chat | బీజింగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించిన సైనిక పరేడ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిసి నడుస్తున్న సమయంలో ఒక హాట్ మైక్ వారి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసింది. ఆ సంభాషణలో ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్లు, బయోటెక్నాలజీ, 150 ఏళ్లు జీవించే అవకాశం, అమరత్వం వంటి అంశాలు ప్రస్తావనకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సంఘటన ఎలా జరిగింది?
పుటిన్, షీ జిన్‌పింగ్, కిమ్ జాంగ్ ఉన్‌లతో కలిసి తియానన్‌మెన్ చౌరస్తాకు చేరుకునే సమయంలో ఈ సంభాషణ లైవ్‌స్ట్రీమ్‌లో రికార్డ్ అయ్యింది. చైనా ప్రభుత్వ టీవీ CCTV ఈ ఫీడ్‌ను ప్రసారం చేసింది. ఆ క్లిప్‌లో పుతిన్ ట్రాన్స్‌లేటర్ చెబుతూ వినిపించారు: “బయోటెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. మానవ అవయవాలను నిరంతరంగా మార్పిడి చేయవచ్చు. ఎక్కువకాలం జీవిస్తే మరింత యౌవనంగా మారవచ్చు, చివరికి అమరత్వం సాధ్యమవుతుంది.”
దీనికి షీ జిన్‌పింగ్ స్పందిస్తూ: “ఈ శతాబ్దంలో మనుషులు 150 ఏళ్లు జీవించగలరని కొందరు అంచనా వేస్తున్నారు” అన్నారు.
ఆ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ చిరునవ్వు చిందిస్తూ పుతిన్–షీల వైపు చూస్తుండగా, ఈ సంభాషణ ఆయనకు అనువదించబడిందా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. CCTV లైవ్‌లో ఈ సంభాషణ 30 సెకన్లపాటు మాత్రమే వినిపించింది. ఆ తర్వాత కెమెరా వైడ్ షాట్‌కి కట్ కావడంతో ఆడియో కూడా కట్ అయింది.
ఈ సంఘటనపై రష్యా ప్రభుత్వం, చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఈ హాట్ మైక్ క్షణం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
విస్తృత సమావేశాలు & ఒప్పందాలు
ఈ పరేడ్‌తో పాటు పుటిన్, షీ జిన్‌పింగ్ 20కిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిలో ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, కొత్త గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు వంటి అంశాలు ఉన్నాయి. అయితే గ్యాస్ ధరలు, ఫైనాన్సింగ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఈవెంట్‌లో షీ జిన్‌పింగ్ 50,000 మందికి పైగా జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ *“ప్రపంచం శాంతి లేదా యుద్ధం మధ్య ఒక ఎంపిక చేయాల్సిన స్థితి”*లో ఉందని పేర్కొన్నారు.
పుటిన్–షీ మధ్య సంభాషణలో బయోటెక్నాలజీ, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్లు, అమరత్వం ప్రస్తావన రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది యాదృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా అన్నది తెలియదు కానీ, ప్రపంచ శక్తుల నాయకులు అమరత్వం, దీర్ఘాయుష్షుపై చర్చించడం గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.