Site icon vidhaatha

Pagers detonated । హిజ్బుల్‌ ఉగ్రవాదులు ఇంకా పేజర్లే ఎందుకు వాడుతున్నారు?

Pagers detonated । హిజ్బుల్లా సభ్యులు (Hezbollah) ఉపయోగించే పేజర్లు ఏకకాలంలో పేలడం సంచలనం సృష్టించింది. లెబనాన్‌ (Lebanon)లో చోటుచేసుకున్న ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. 3వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు లెబనాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి మొదలయ్యాయి. చనిపోయినవారిలో ఒక ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉన్నది. హిజ్బుల్లా మిలిటెంట్లకు గట్టి పట్టున్న ప్రాంతాలుగా భావించే బేకా లోయ (Bekaa valley), దహియేగా (Dahiyeh) పిలిచే బీరుట్‌ దక్షిణ ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.30 గంటల నంచి వరుస పేలుళ్లు (detonations) మొదలయ్యాయి.

ఈ తరంలో చాలా మందికి పేజర్లు తెలియకపోవచ్చు. మొబైల్‌ ఫోన్లు ప్రాచుర్యం పొందటానికి ముందు పేజర్లు వినియోగంలో ఉండేవి. ఇప్పుడు మనం ఎస్‌ఎంఎస్‌లు చేసుకుంటున్నట్టే.. పేజర్ల ద్వారా సందేశాలు పంపుకునేవారు. కానీ.. తర్వాతి కాలంలో వచ్చిన సెల్‌ఫోన్లు.. పేజర్లను యుగానికి స్వస్తి చెప్పాయి. అయినప్పటికీ కూడా హిజ్బుల్‌ మిలిటెంట్లు ఇంకా పేజర్లనే వినియోగిస్తుండటం ఆశ్చర్యం. దీని వెనుక ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

పేజర్లు పేలిన ఘటనపై హిజ్బుల్లా స్పందిస్తూ ఇది ఇజ్రాయెల్‌ (Israel) పనేనని ఆరోపించింది. హిబ్బుల్లా సంస్థకు ఇరాన్‌ మద్దతు ఉన్న విషయం తెలిసిందే. ‘పౌరులను సైతం టార్గెట్‌ చేసిన ఈ దుందుడుకు నేరానికి శత్రువు ఇజ్రాయెల్‌ కారణం’ అని హిజ్బుల్‌ ఒక ప్రకటనలో ఆరోపించింది. దీనికి ఇజ్రాయెల్‌ తగిన శిక్ష (punishment) అనుభవించక తప్పదని హెచ్చరించింది. ఈ ఆపరేషన్‌ ముగియగానే దాని గురించి అమెరికా పెద్దలకు ఇజ్రాయెల్‌ తెలియజేసినట్టు పేరు రాయడానికి నిరాకరించిన అమెరికా అధికారి ఒకరు చెప్పారు.

దాడి జరిగింది ఇలా..
హిజ్బుల్‌ మిలిటెంట్లు వాడుతున్న దాదాపు 5వేల పేజర్లలో మొస్సాద్‌ స్పై ఏజెన్సీ (Mossad spy agency) పేలుడు పదార్థాలు అమర్చిందని రాయిటర్స్‌ వార్తా సంస్థకు సీనియర్‌ లెబనాన్‌ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. ఈ పేజర్లను కొద్ది నెలల ముందు లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపు దిగుమతి చేసుకున్నది. ఇవి తైవాన్‌లోని గోల్డ్‌ అపోలో (Gold Apollo) కంపెనీ నుంచి వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే.. ఆ కంపెనీ మాత్రం తాము ఆ పేజర్లను తయారు చేయలేదని చెబుతున్నది. తన బ్రాండ్‌నేమ్‌ను వాడుకునేందుకు ఒక యూరోపియన్‌ సంస్థ (European firm) సదరు కంపెనికి అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నారు. పేజర్లను తయారు చేసే దశలోనే మొస్సాద్‌ సంస్థ వాటిలో మార్పు చేసిందని లెబనాన్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ‘కోడ్‌ ద్వారా యాక్టివేట్‌ అయ్యే పేలుడు పదార్థాల(explosive material)ను మొస్సాద్‌ సంస్థ పేజర్‌ బోర్డులో అమర్చింది. దానిని పసిగట్టడం అసాధ్యం. ఏ స్కానర్‌ కూడా దానిని గుర్తించలేదు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సదరు పేజర్లకు కోడ్‌ సందేశం వెళ్లగానే దాదాపు 3వేల పేజర్లు పేలిపోయాయి తెలిపాయి.

సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సదరు సెల్‌ఫోన్‌ కలిగిన వ్యక్తి జాడలను ప్రభుత్వాలు గుర్తు పట్టేస్తాయి. అందుకే హిజ్బుల్‌ సభ్యులెవరూ సెల్‌ఫోన్లు వాడొద్దని గతంలో దాని నాయకుడు హసన్‌ నస్రల్లా (Hassan Nasrallah) హెచ్చరించాడు.దానితో అప్పటి నుంచి హిజ్బుల్లా గ్రూపు సెల్‌ఫోన్లు వాడటం నిలిపివేసింది. పేజర్లను తమ కమ్యూనికేషన్ల (pagers for communication) కోసం ఉపయోగిస్తున్నది. సెల్‌ఫోన్లు, పేజర్లు దాదాపు ఒకే తరహా టెక్నాలజీలో పేజర్ల కంటే స్మార్ట్‌ఫోన్‌లలో కమ్యూనికేషన్‌ను గుర్తించే రిస్క్‌ ఎక్కువ ఉంటుందని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌లో అడ్జంక్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ నికోలస్‌ రాయీస్‌ అసోసియేటెడ్‌ వార్తా సంస్థకు చెప్పారు. ఈ దాడితో హిజ్బుల్‌ మిలిటెంట్లు తమ కమ్యూనికేషన్‌ వ్యూహాలను (communication strategies) మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ దాడినుంచి తప్పించుకున్న హిజ్బుల్‌ సభ్యులు తమ వద్ద ఉన్న పేజర్లే కాకుండా సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు వంటి అన్ని గాడ్జెట్లను వదిలేస్తారని చెప్పారు.

Exit mobile version