Amazon Jobs Cut | 30వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌!

కరోనా సమయంలో అప్పటి డిమాండ్‌ మేరకు లెక్కకు మించి స్టాఫ్‌ను నియమించుకున్న అమెజాన్‌.. గత రెండేళ్లుగా కొంతకొంత మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నది. తాజాగా 30వేల మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది.

Amazon Jobs Cut | దిగ్గజ్‌ టెక్‌ సంస్థ అమెజాన్‌.. ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. మంగళవారం నుంచి దాదాపు 30వేల కార్పొరేట్‌ ఉద్యోగాలకు కోత పెట్టనున్నది. కొవిడ్‌ విశ్వమారి సమయంలో డిమాండ్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండటంతో అమెజాన్‌ కంపెనీ లెక్కకు మించి ఉద్యోగులను నియమించుకున్నది. ఇప్పుడు అంత మంది అవసరం లేకపోవడంతో ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు, పనిలోపనిగా ఖర్చులు తగ్గించుకునేందుకు అమెజాన్‌ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 15లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్న అమెజాన్‌ కంపెనీలో 3.50 లక్షల మంది కార్పొరేట్‌ ఎంప్లాయీస్‌ ఉన్నారు. వారిలో సుమారుగా పదిశాతం మందిని తొలగించేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. అమెజాన్‌ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడం 2022 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సమయంలో సుమారు 27 వేల మందిని అమెజాన్‌ తొలగించింది.

దీనిపై స్పందించేందుకు అమెజాన్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. డివైసెస్‌, కమ్యూనికేషన్స్‌, పాడ్‌కాస్టింగ్‌ సహా వివిధ రంగాల్లో చిన్న చిన్న సంఖ్యల్లో ఉద్యోగులను అమెజాన్‌ గత రెండేళ్లుగా తొలగిస్తూ వస్తున్నది. తాజాగా చేపట్టిన తొలగింపులతో మానవ వనరులు (పీపుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ టెక్నాలజీ లేదా పీఎక్స్‌టీ), అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ వంటి రంగాల్లో కొంత ప్రభావం కనిపిస్తుందనే అభిప్రాయాలను ఈ విషయంలో సమాచారం ఉన్న వారు చెబుతున్నారు.

తొలగిస్తున్న ఉద్యోగులకు మంగవారం ఉదయం నుంచే ఈమెయిల్‌ నోటిఫికేషన్స్‌ వెళుతున్న నేపథ్యంలో వారితో ఎలా కమ్యూనికేట్‌ చేయాలనే విషయంలో సంబంధిత ఉద్యోగుల మేనేజర్లకు ముందుగానే శిక్షణ కూడా ఇచ్చారని సమాచారం. అవసరానికి మించి ఉన్న సిబ్బందితోపాటు.. మేనేజర్ల సంఖ్యను కూడా తగ్గించే ఉద్దేశంతో అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా తొలగింపుల ప్రక్రియ మొదలైందని అంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ)ను అమెజాన్‌ విస్తృత స్థాయిలో వాడుతున్న కారణంగా ఉద్యోగాల్లో మరిన్ని కోతలు ఉంటాయని జస్సీ గత జూన్‌లోనే చెప్పారు.