విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం..పోలీస్ శాఖలు ఎంతగా మొత్తుకున్న యువత మత్తు మార్గాన్ని వదలడం లేదు. తాజాగా మైనర్లను టార్గెట్ గా చేసుకుని మద్యం, గంజాయి పార్టీలు(drug and alcohol party) నిర్వహిస్తున్న వ్యవహారాన్ని రాజేంద్రనగర్ స్పెషల్ టాస్క్ ఫోర్సులు రట్టు చేశారు. చెర్రీ వోక్స్ ఫామ్‌హౌస్‌పై(Cherry Oaks Farmhouse) దాడి చేసిన పోలీసులు మైనర్ల మందు పార్టీని భగ్నం చేసి 50 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అందులో 25 మందికిపైగా మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. వారిలో 13 మంది మైనర్ బాలికలు కూడా ఉన్నారు. నగరానికి చెందిన ఒక డీజే ఇన్‌స్టా యాప్‌లో ‘ట్రాప్ హౌస్.9ఎంఎం’ (Trap House)పేరుతో ఖాతా నిర్వహిస్తున్నాడు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చాడు. ఈ పార్టీకి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ నమ్మించాడు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు పాస్‌లు తీసుకోవాలని షరతు విధించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800 ధర నిర్ణయించాడు. ఇన్‌స్టాలో ఈ ప్రకటనను చూసిన మైనర్లు పార్టీకి పేర్లు నమోదు చేసుకున్నారు.
పార్టీలో మత్తు పదార్ధాలు
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది శనివారం మొయినాబాద్‌లోని ఓక్స్ ఫామ్‌హౌస్‌కు చేరారు. ఇన్ స్టా ద్వారా ఒక చోట చేరిన వారంతా మత్తు పార్టీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ..ఈ వేడుకల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా అందిన సమాచారంతో ఎస్ ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా..వారిలో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారించారు. 8 మద్యం బాటిళ్లు, 6 సెల్ ఫోన్లు, డీజే సీజ్ చేశారు. ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేసి మెయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.