Site icon vidhaatha

crime case solved । కొట్టి చంపి.. ముక్కలుగా నరికి.. మంగళూరు మహిళ హత్య కేసులో దోషులకు యావజ్జీవం

crime case solved । ఒక చోట తల దొరికింది.. మరో చోట మొండెం దొరికింది.. వేరొక చోట నరికేసిన కాళ్లు కనిపించాయి. మృతురాలు ఎవరో తెలియదు.. చంపిందెవరో అప్పటికి ఎలాంటి ఆధారాల్లేవు. భర్త మీద అనుమానం వచ్చినా.. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. మరో వ్యక్తిని ప్రశ్నించినా.. ఆయన అప్పటికే ఒక దొంగతనం కేసులో జైల్లో ఉన్నాడు. మరి చంపిందెవరు? ఎప్పుడో 2019 నాటి హత్య కేసును కర్ణాటకలోని మంగళూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సుదీర్ఘకాలం తర్వాత దోషులకు కోర్టు యావజ్జీవి శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

2019 మే 12న ఒక పండ్ల వ్యాపారి ఉడిపి- మంగళూరు రోడ్డుపై ఒక  సంచిలో హెల్మెట్‌తో ఉన్న మహిళ తల కనిపించిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలు ఎవరనేది అప్పటికి తెలియలేదు. ఇతర శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ వచ్చింది. తల, కాళ్లు లేని మొండెం క్రిస్టియన్‌ సిమెట్రీ వద్ద పడి ఉందనేది ఆ ఫోన్‌ సారాంశం. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే మొండెంలో కొంత భాగాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఆ మొండేన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇతర శరీర భాగాల కోసం చుట్టుపక్కల వెతికారు. పోలీసులు వెతుకుతున్న క్రమంలోనే కంట్రోల్‌ రూమ్‌కు మరో సందేశం వచ్చింది. సిమెట్రీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన రెండు కాళ్లు కనిపించాయని దారినపోయేవారు  పోలీసులకు తెలిపారు. ముక్కలు ముక్కలుగా ఉన్న శరీర భాగాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకుని వెన్‌లాక్‌ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. మొదటిగా ఎవరైనా మహిళ మిస్సింగ్‌ ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయేమో చూడాలని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో కిశోర్‌ శెట్టి అనే వ్యక్తి దక్షిణ మంగళూరు పోలీస్‌ స్టేసన్‌కు వచ్చాడు. తన సోదరి శ్రీమతి శెట్టి (30) కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఆమె ఫోటో చూపించాడు. దాంతో అతడిని మార్చురీకి తీసుకెళ్లగా.. తన సోదరిని ఆయన గుర్తించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో మృతురాలు ఎవరనేది తేలింది. మరి ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఇది పెద్ద మిస్టరీగా పోలీసులకు తయారైంది.

శ్రీమతి శెట్టికి ఒక ఎలక్ట్రానిక్స్‌ షాప్‌తోపాటు చిట్టీల వ్యాపారం కూడా ఉంది. భర్త నుంచి విడిపడి ఉంటున్నది. భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోయినా.. సందీప్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే విభేదాల కారణంగా అతడితోనూ ఆమె విడిపోయింది. దీంతో శ్రీమతి శెట్టి భర్త, సుదీప్‌ ఇద్దరే అనుమానితులుగా పోలీసులకు మిగిలారు. భర్తను ప్రశ్నిస్తే.. తాను చాలా కాలంగా ఆమెతో సంబంధాల్లో లేనని చెప్పాడు. ఒక దొంగతనం కేసులో సుదీప్‌ మంగళూరు జైల్లో ఉన్నాడు. తానుకూడా ఆమెతో సంబంధాల్లో లేనని పోలీసుల దర్యాప్తులో సుదీప్‌ వెల్లడించాడు. కాల్‌ రికార్డ్స్‌ పరిశీలించిన పోలీసులు.. వారిద్దరికీ ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు. శ్రీమతికి ఎవరితోనూ విభేదాలు లేవని ఆమె షాపులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు చెప్పారు. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీమతి చిట్టీల వ్యాపారం చేస్తుండటంతో.. ఆమె ఎవరెవరికి అప్పులు ఇచ్చారో జాబితాను పోలీసులు బయటకు తీశారు.

హత్య జరగడానికి ముందు ఆమె కదలికలను సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు సంపూర్ణంగా గమనించారు. 2019 మే 11న పోలీసులకు తొలి క్లూ లభించింది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన శ్రీమతి.. 9 గంటలకల్లా షాపునకు వచ్చింది. 9 గంటల నుంచి ఆమె ఎటు వెళ్లిందనే విషయాన్ని దాదాపు వందకుపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. 9.09 గంటలలకు సూటెర్‌పేట్‌ వైపు తన టూవీలర్‌పై వెళుతూ కనిపించింది. సెయింట్‌ ఆంటోనీ హార్డ్‌వేర్‌ షాపు వద్ద కొద్దిసేపు ఆగి, అక్కడ ఒక బైక్‌పై ఆగి ఉన్న వ్యక్తితో మాట్లాడినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. రెండు క్షణాల సంభాషణ అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆమె కదలికలు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించలేదు. శ్రీమతి మాట్లాడిన వ్యక్తిని జొనాస్‌ శాంసన్‌గా గుర్తించారు. శ్రీమతి అప్పులు ఇచ్చినవారి జాబితాలో అతడి పేరు కూడా ఉన్నది. మే 14, 2019న పోలీసులు శాంసన్‌ ఇంటికి వెళ్లారు. పోలీసులు రావడం గమనించిన శాంసన్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇంటి పై కప్పును బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు.. అతడిని హాస్పిటల్‌కు తరలించారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. శాంసన్‌ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

మంగళూరు బీచ్‌లో కెబాబ్‌లు అమ్ముకునే వ్యాపారి శాంసన్‌. శ్రీమతి నుంచి 35,500 అప్పు తీసుకున్నాడు. ఇంకా 16వేల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. అప్పు తీర్చాలని నలుగురి మధ్య అడగడమే కాకుండా.. ఒకసారి శాంసన్‌ను అతడి స్నేహితుల ముందే దూషిస్తూ మాట్లాడిందని పోలీసులు తెలిపారు. దారి మధ్యలో కలిసినప్పుడు ఏం మాట్లాడారని పోలీసులు ఆరా తీస్తే.. శ్రీమతి తన ఇంటికే వస్తున్నట్టు చెప్పిందని, తాను రెండు నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పానని తెలిపాడు. ఇంటికి వచ్చిన శ్రీమతి.. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసిందని పోలీసువర్గాలు తెలిపాయి. శాంసన్‌ను ఆయన భార్య విక్టోరియా మతియాస్‌ ముందే నానా దుర్భాషలాడిందని పేర్కొన్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన శాంసన్‌.. ఒక చెక్కతో శ్రీమతిని రెండుసార్లు బాదాడు. దాంతో ఆమె చనిపోయింది. శ్రీమతి శవాన్ని ఇద్దరూ కలిసి బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి.. ముక్కలుగా నరికారు. వాటిని నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. శ్రీమతి సెల్‌ఫోన్‌ను ఆమె టూవీలర్‌లో పెట్టి.. దానిని ఒక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో పార్క్‌ చేశాడు శాంసన్‌. అతడు వచ్చేలోపు ఇంటిని విక్టోరియా శుభ్రం చేసేసింది. అక్కడి నుంచి వారిద్దరూ విక్టోరియా సోదరి ఇంటికి వెళ్లిపోయారు. శాంసన్‌, విక్టోరియాలను మే 15, 2029న అరెస్టు చేశారు. శ్రీమతి మృతదేహంపై 42 గాయాలను గుర్తించారు. కొవిడ్‌ కారణంగా న్యాయ పక్రియ ఆలస్యమైంది. 2022, జూలై 14న కేసు విచారణ మొదలైంది. 2024, సెప్టెంబర్‌ 13న దక్షిణ కన్నడ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి నిందితులైన భార్యాభర్తలకు జీవిత ఖైదు, 25వేల జరిమానా విధించారు.

Exit mobile version