- చిన్నారులు సహా 21 మందికి గాయాలు
- పలువురు పరిస్థితి విషమం
- పోలీసుల అదుపులో ముగ్గురు
విధాత: అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. సూపర్ బౌల్ విజేతగా నిలిచినందుకు కేన్సాస్ సిటీ చీఫ్స్ పరేడ్ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయి. వేలాది మంది పాల్గొన్న విజయోత్సవ ర్యాలీలో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక ప్రజలు నలుదిక్కులా పరుగులు పెట్టారు.
ఈ కాల్పుల ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. 11 మంది చిన్నారులుసహా 21 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరంతా సమీప దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్ర బుల్లెట్ గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు.
కాల్పులకు పాల్పడ్డ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ మీడియాకు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాస్ జట్టు ప్రకటించింది.
సూపర్ బౌల్ ఛాంపియన్‌షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగం. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. ఆ జట్టు విజయోత్సవాలను నిర్వహించింది. ప్రతి ఏడాది సూపర్ బౌల్ ఛాంపియన్‌షిప్ జరుగుతుంది.