Site icon vidhaatha

మూత్రం పోయొద్ద‌న్నందుకు కాల్పులు.. 12 ఏండ్ల బాలుడు మృతి

Madhya Pradesh | త‌న ఇంటి ముందు మూత్ర విస‌ర్జ‌న చేయొద్ద‌ని చెప్ప‌డ‌మే నేర‌మైంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోక‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డ‌మే పాప‌మైంది. అత‌నిపై క‌క్ష పెంచుకున్న వ్య‌క్తి.. కుటుంబంపై కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల‌కు 12 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కోట్ గ్రామానికి చెందిన వికాస్ ఇంటి ముందు పింటూ శ‌ర్మ అనే వ్య‌క్తి ప్ర‌తిరోజు మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నాడు. గ‌మ‌నించిన వికాస్.. త‌న ఇంటి ముందు మూత్ర విస‌ర్జ‌న చేయొద్ద‌ని సూచించాడు. అయిన‌ప్ప‌టికీ శ‌ర్మ వినిపించుకోలేదు. ఈ క్ర‌మంలో వికాస్, శ‌ర్మ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. దీంతో పింటూ శ‌ర్మ‌పై వికాస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

త‌న‌పైనే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తావా అంటూ శ‌ర్మ కోపంతో ఊగిపోయాడు. ఇక పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన శ‌ర్మ‌.. త‌న స్నేహితుడితో క‌లిసి వికాస్ ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిపై తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. దీంతో 12 ఏండ్ల బాలుడు మృతి చెందాడు. మిగ‌తా ఇద్ద‌రు తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో పింటూ శ‌ర్మ‌తో పాటు అత‌ని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version