Stray Dog Attack | తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చిన్నారులు కుక్కలకు బలయ్యారు. తాజాగా ఏపీలో అభంశుభం తెలియని ఏడాదిన్నర చిన్నారి వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా జీ.సిగడాం మండలం మెట్టవసలో చోటు చేసుకున్నది. స్వాతిక (18నెలలు) చిన్నారిపై ఒక్కసారిగా వీధికుక్కలు దాడి చేశాయి.
దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వాతిక మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీధికుక్కలను నియంత్రించకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయంటూ జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో ప్రతి రెండు సెకన్లకో ఒకరు కుక్కకాటుకు గురవుతున్నారని, ప్రతి అరగంటకొకరు మరణిస్తున్నారని ఇటీవల ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం. భారత్‌లో రెండు కోట్ల కుక్కలున్నాయి. ఇందులో వీధికుక్కలు 1.53 కోట్లు. కుక్కకాటు, ఇతర జంతువుల కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 18వేల నుంచి 20వేల మంది మరణిస్తున్నారు. దేశంలో 93శాతం రేబిస్ మరణాలు కుక్కకాటు వల్లనే సంభవిస్తున్నాయి. ఇందులో 63శాతం మరణాలు వీధి కుక్కలు, పట్టణాల్లో 60శాతం, గ్రామాల్లో 64శాతం వీధికుక్కల ద్వారా మరణాలు సంభవిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.