విధాత : గుజరాత్‌లో అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌లో భారీగా ఈ-సిగరెట్లను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. ఈ-సిగరెట్ల విలువ రూ. 48 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ముంద్రా పోర్టులోని ఓ కంటైనర్‌లో ఈ-సిగరెట్లు ఉన్నట్లు డీఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో అధికారులు శుక్రవారం అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
ఫ్లోర్ క్లీన్ మాప్ అని రాసి ఉన్న కంటైనర్ నుంచి ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కంటైనర్‌లో హ్యాండ్ మసాజర్, ఎల్‌సీడీ రైటింగ్ ప్యాడ్, సిలికాన్ పాప్ ఆప్ టాయ్స్ బయటపడ్డాయి. ఇంకా కంటైనర్‌ను పూర్తిగా పరిశీలించగా, లోపల కార్టన్ బాక్సులు బయటపడ్డాయి.
250 కార్టన్‌లలో 2 లక్షల ఈ-సిగరెట్లు లభ్యమయ్యాయి. ప్రతి కార్టన్‌లో 400 సిగరెట్లు ఉన్నాయి. ఈ-సిగరెట్లన్నీ చైనా బ్రాండ్ యూటో పేరుతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిల్క్ కాఫీ, మింట్ ఐస్, ఎనర్జీ డ్రింక్ టీ, కోక్ ఐస్ లాంటి ఫ్లేవర్లతో కూడిన సిగరెట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ నెల 4వ తేదీన రూ. 20 కోట్ల విలువ చేసే ఈ-సిగరెట్లను ఇదే గుజరాత్‌లో అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సూరత్ వద్ద ట్రక్కులో తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు.