Site icon vidhaatha

కాపురానికి వెళ్ల‌లేద‌ని కూతురి హ‌త్య‌.. త‌ల‌, మొండెం వేరు చేసిన తండ్రి

Nandyala | ఓ యువ‌తికి రెండేండ్ల క్రితం వివాహ‌మైంది. కానీ ఆమె మ‌రొక‌రిని ప్రేమిస్తోంది. కొద్ది రోజుల క్రితం సొంతూరికి వ‌చ్చిన ఆమె.. కాపురానికి వెళ్ల‌కుండా, త‌న ప్రేమికుడిని క‌లుసుకునేందుకు ఆరాట‌ప‌డుతోంది. దీంతో త‌న ప‌రువు పోయింద‌ని భావించిన తండ్రి కూతురిని గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం త‌ల, మొండెం వేరు చేసి అట‌వీ ప్రాంతంలో ప‌డేశాడు. ఈ ఘ‌ట‌న నంద్యాల జిల్లాలోని పాణ్యం మండ‌లంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పాణ్యం మండ‌ల ప‌రిధిలోని ఆల‌మూరు గ్రామానికి చెందిన దేవేంద్ర రెడ్డికి ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు ప్ర‌స‌న్న‌(21)కు రెండేండ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం జ‌రిపించారు. ప్ర‌స‌న్న త‌న భ‌ర్త‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో నివాసం ఉండేది. అయితే ప్ర‌స‌న్న త‌న పెళ్లికి ముందే మ‌రో యువ‌కుడితో ప్రేమ‌లో ఉంది. ప్రియుడితో సాన్నిహిత్యం కార‌ణంగా ఇటీవ‌లే హైద‌రాబాద్ నుంచి ఆల‌మూరుకు వ‌చ్చింది. ఇక తిరిగి భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదు ప్ర‌స‌న్న‌.

ప‌రువు పోయింద‌ని భావించి హ‌త్య‌

కుమార్తె కాపురానికి వెళ్లక‌పోవ‌డంతో త‌న ప‌రువు పోయింద‌ని భావించిన తండ్రి.. ఆమెను ఈ నెల 10వ తేదీన గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం డెడ్‌బాడీని కారులో నంద్యాల – గిద్ద‌లూరు మార్గంలోని అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. త‌ల‌, మొండెం వేరు చేసి, వేర్వేరు ప్రాంతాల్లో ప‌డేశాడు. అనంత‌రం ఏమి తెలియ‌నట్లు ఇంటికి చేరుకున్నాడు.

తాత నిల‌దీయ‌డంతో.. వెలుగులోకి ప్ర‌స‌న్న హ‌త్య‌..

అయితే ప్ర‌స‌న్న ప్ర‌తి రోజు త‌న తాత శివారెడ్డికి ఫోన్ చేసేది. ఈ మ‌ధ్య‌కాలంలో ఆమె ఫోన్ చేయ‌క‌పోవ‌డంతో శివారెడ్డికి అనుమానం వ‌చ్చింది. ప్ర‌స‌న్న ఎక్క‌డికి వెళ్లింద‌ని దేవేంద్ర రెడ్డిని శివారెడ్డి నిల‌దీశాడు. కాపురానికి వెళ్ల‌క‌పోవ‌డంతో ప‌రువుపోయింద‌ని భావించి, ప్ర‌స‌న్న‌ను హ‌త్య చేసిన‌ట్లు దేవేంద్ర రెడ్డి తెలిపాడు. దీంతో శివారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దేవేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా, ప్ర‌స‌న్న‌ను తానే చంపిన‌ట్లు అంగీక‌రించాడు. గిద్ద‌లూరు అట‌వీ ప్రాంతంలో ప‌డేసిన తల‌, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీకి త‌ర‌లించారు.

Exit mobile version