Site icon vidhaatha

క్రికెటర్‌ విహారి వివాదంపై భగ్గుమన్న ఏపీ ప్రతిపక్ష నేతలు


విధాత : ఆంధ్రా క్రికెట్‌ రంజీ జట్టు కెప్టన్‌ హనుమా విహారి వివాదం ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముంగిట రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ చివరకు క్రీడలను కూడా తన వికృత రాజకీయాలతో భ్రష్టుపటిస్తుందని టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌లు విమర్శల దాడి చేశాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు స్పందిస్తూ వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని విమర్శించారు.


ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి అని, ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని చంద్రబాబు ఆరోపించారు. అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఆట పట్ల అతడికున్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవన్నారు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరని వ్యాఖ్యానించారు.


నారా లోకేశ్‌ స్పందిస్తూ అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి హనుమ విహారి నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రెండు నెలల్లోనే తమ ప్రభుత్వం రాబోతుందని, ఏపీ తరపున తిరిగి ఆడటానికి విహారి రావాలని ఆహ్వానించారు. విహారి, అతడి జట్టుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.



క్రికెటర్‌ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌


ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలదీశారు. గాయాలను లెక్కచేయకుండా భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం హనుమ విహారి తన క్రీడా శక్తినంతటిని ధారపోశారని పవన్ కొనియాడారు. ఏపీ రంజీ జట్టు నాకౌట్ చేరడంలో అతడిది కీలక పాత్ర అని ప్రశంసించారు. వైసీపీ నేత దురుసు వైఖరి కారణంగానే అతడు కెప్టెన్సీకి రాజీనామా చేశాడని, విహారి పట్ల ఏసీఏ చూపించిన తీరుకు చింతిస్తున్నానన్నారు.


మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ను రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాభమేంటని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమ విహారికి భవిష్యత్తులో మంచి జరగాలని పవన్ ఆకాంక్షించారు. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్ అసోసియేషనన్‌తో అతడు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతాడన్న విశ్వాసం వ్యక్తం చేశారు.


క్రీడలలోనూ వైసీపీ కుట్ర రాజకీయాలు : వైఎస్‌ షర్మిల


ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పుడు క్రీడలపైనా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ వైఎస్‌.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తీరును ఆమె తప్పుబట్టారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన ఈ నేతలు.. ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేమన్నారు. “ఆడుదాం ఆంధ్రా అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు వాస్తవంగా ఆడుతున్న ఆటలు ఇవేనా? అని నిలదీశారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషనా లేక అద్వాన్నపు క్రికెట్ అసోసియేషనా! అని ప్రశ్నించారు. విహారి వివాదంపై వెంటనే విచారణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు.

Exit mobile version