ఆమెకు 12 ఏండ్ల వయసు.. చూడటానికి ఆరోగ్యంగానే ఉంది. కానీ ఆ బాలికకు క్యాన్సర్ ఉంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించలేకపోయారు. కేవలం యాపిల్ వాచ్ మాత్రమే ఆ బాలికను అలర్ట్ చేసింది. ఎలా అంటే యాపిల్ వాచ్ లో సాధారణంగా హృదయస్పందన అప్ డేట్ అవుతుంది.
అయితే రెగ్యులర్ గా ఆ అమ్మాయి యాపిల్ వాచ్ ధరిస్తుంటుంది. ఇటీవలే సడెన్ గా హార్ట్ బీట్ చాలా ఎక్కువకు పెరిగింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా క్యాన్సర్ కణితి పెరుగుతున్నట్లు నిర్ధారించారు. అలా యాపిల్ వాచ్ ఓ బాలిక నిండు ప్రాణాలను కాపాడింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన జెస్సికా అనే మహిళ తన 12 ఏండ్ల కూతురు ఇమానీ మైల్ తో కలిసి ఉంటుంది. అయితే ఇటీవల ఇమానీ ధరించిన యాపిల్ వాచ్ లో లాంగ్ బీప్ సౌండ్ వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో ఇమానీ హార్ట్ రేట్ కూడా అధికంగా పెరిగింది. యాపిల్ వాచ్ కూడా పని చేయకపోయే సరికి, భయంతో ఆస్పత్రికి పరుగులు పెట్టారు.
బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అపెండిక్స్‌లో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆ కణితి అప్పటికే బాడీలో స్ప్రెడ్ అవుతున్నదని, వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పారు. మైల్ కుటుంబం అంగీకరించడంతో సర్జరీ చేసి ఆ కణితిని తొలగించి బాలిక ప్రాణాలు కాపాడారు.
మైల్‌లో కనిపించింది న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అని, ఈ సమస్య చిన్నపిల్లల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మైల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యాపిల్ వాచ్ ధరించకపోయి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయేదేమో అని తల్లి జెస్సికా పేర్కొన్నారు.