Beach rocks | అక్కడి బీచ్‌లలో గులకరాళ్లు తీసుకుంటే లక్షల్లో ఫైన్‌ కట్టాల్సిందే.. ఎక్కడంటే..!

  • Publish Date - March 23, 2024 / 05:02 AM IST

Beach rocks : సాధారణంగా బీచ్‌లకు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో, రంగుల్లో ఉండే గులకరాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. అందుకే కొంతమంది వాటిని సరదాగా సేకరిస్తారు. ఇళ్లకు తెచ్చుకుని భద్రంగా దాచుకుంటారు. అయితే స్పెయిన్‌ దేశంలోని బీచ్‌లలో మాత్రం గులకరాళ్లను చూసి ఆనందించాల్సిందే తప్ప వెంట తెచ్చుకోవడం కుదరదు. ఎందుకంటే అక్కడి కానరీ దీవుల్లో (Canary Islands) గులకరాళ్లను సేకరిస్తే జరిమానా విధిస్తారట. జరిమానా అంటే వందనో, రెండు వందలో కాదు. ఏకంగా లక్షల్లోనే జేబులకు చిల్లుపెడుతారట. ఆఫ్ట్రాల్‌ గులకరాళ్లకు ఎందుకంత జరిమానా అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..

స్పెయిన్‌లోని కానరీ దీవులు అందాలకు నెలవు. ఏటా లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. అలా వెళ్లేవారంతా అక్కడ దొరికే అందమైన రాళ్లు, ఇసుకను ఇష్టంగా తీసుకెళ్లిపోతున్నారు. దాంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందనే ఉద్దేశంతో అక్కడి అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రాళ్ల విలువను బట్టి 128 పౌండ్ల (దాదాపు రూ.13,478) నుంచి 2,563 పౌండ్ల (దాదాపు రూ.2,69,879) దాకా జరిమానా విధిస్తున్నారు. టన్నుల కొద్దీ గులకరాళ్లు, ఇసుక మాయమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కానరీ సమూహంలో ప్రధానంగా ఏడు దీవులున్నాయి. అవి టెనెరిఫ్‌, గ్రాన్‌ కనారియా, లాంజ్‌రోట్‌, ఫ్యూయెట్‌ ఈవెంట్యురా, లాపామా, లా గొమెరా, ఎల్‌ హెయిరో. వాటిలో ఒక్కో దీవికి ఒక్కో ప్రత్యేకత ఉంది. స్పెయిన్‌లో అత్యంత ఎత్తైనది అయిన టెయిడ్‌ శిఖరం టెనెరిఫ్‌ దీవిలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పర్యాటకులు లాంజ్‌రోట్‌ ద్వీప సందర్శనకు వెళ్తుంటారు. అగ్నిపర్వతం లావా (volcanic material) నుంచి ఏర్పడిన చిన్నచిన్న గులకరాళ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

అందుకే పలువురు పర్యాటకులు ఆ రాళ్లను వెంట తీసుకెళ్తున్నారు. దాంతో ఏటా టన్నుల కొద్ది రాళ్లు మాయమవుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్యూయెట్‌ ఈవెంట్యురా దీవిలోని ‘పాప్‌కార్న్‌ బీచ్‌’ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పాప్‌కార్న్‌ ఆకారంలో ఉండే గులకరాళ్లు అక్కడి ప్రత్యేకత. అక్కడికి వెళ్లినవారంతా వాటిని తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ కూడా వేల కిలోల గులకరాళ్లు, ఇసుక మాయమవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అందుకే తీర ప్రాంత ఉనికి ప్రమాదంలో పడుతోందని గ్రహించి, ముందస్తు చర్యల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. సందర్శకులను తనిఖీ చేసేందుకు విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పర్యటకులంతా పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని అక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

Latest News