విధాత : అభం శుభం తెలియని ఓ అమాయక బాలికపై కొందరు కామాంధులు క్రూర మృగల్లా విరుచుకుపడ్డారు. రెండేండ్ల క్రితం ఓ బాలికపై బీజేపీ నాయకుడితో సహా కొందరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 21 మందికి జైలు శిక్ష పడింది. ఇందులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వాషర్‌మెన్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో 2020, నవంబర్‌లో ఓ 13 ఏండ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిందితులను అరెస్టు చేయాలని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పట్టించుకోలేదు. పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పుగలేందు, బీజేపీ నాయకుడు రాజేంద్రన్, జర్నలిస్ట్ వినోభాజీ కలిసి ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. దాదాపుగా 100 మందికి పైగా ఆమెపై అత్యాచారం చేశారు.
తన బిడ్డకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి వాషర్‌మెన్ పేట్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 560 పేజీల ఛార్జిషీటును కోర్టుకు సమర్పించారు. ఈ 26 మందిలో బాలిక సవతి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో నలుగురు పరారీ కాగా, ఒకరు చనిపోయారు.
నిన్న ఈ కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. 21 మందిలో 8 మందికి జీవిత ఖైదు విధించింది. మిగతా 13 మందికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కో నిందితుడు బాధితురాలికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
బాధితురాలి సవతి తల్లిదండ్రులకు జీవిత ఖైదు పడగా, సబ్ ఇన్‌స్పెక్టర్, బీజేపీ నేత, జర్నలిస్టుకు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది.